Old/New Testament
కనానీయులతో యూదా యుద్ధం చేయటం
1 యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రార్థన చేసారు: యెహోవాతో, “మా వంశాలలో ఏది ముందుగా వెళ్లి, మా పక్షంగా కనానీయులకు విరోధంగా యుద్ధం చేయాలి?” అని వారు అడిగారు.
2 యెహోవా, “యూదా వంశస్థులు వెళతారు. నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
3 యూదా పురుషులు, వారి సోదరులైన షిమ్యోను వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికి కొంత భూమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మనుష్యులు అంగీకరించారు.
4 కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. బెజెకు పట్టణం దగ్గర యూదావారు 10,000 మందిని చంపేసారు. 5 బెజెకు పట్టణంలో బెజెకు పాలకుని యూదా మనుష్యులు చూసి అతనితో పోరాడారు. యూదా వారు కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.
6 బెజెకు పాలకుడు[a] పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ యూదా వారు అతనిని తరిమి పట్టుకొన్నారు. వారు అతనిని పట్టుకున్నప్పుడు అతని కాళ్లు చేతుల బొటన వేళ్లను వారు కోసివేసారు. 7 అప్పుడు బెజెకు పాలకుడు, “డెబ్బై మంది రాజుల కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను కోసివేసాను. ఆ రాజులు నా బల్ల మీదనుండి క్రింద రాలిన ఆహారం ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మనుష్యులు యెరూషలేముకు తీసుకొని వెళ్లారు. అతడు అక్కడ మరణించాడు.
8 యూదావారు యెరూషలేము మీద యుద్ధం చేసి దానిని పట్టుకొన్నారు. యెరూషలేము ప్రజలను చంపేందుకు యూదావారు వారి ఖడ్గాలు ఉపయోగించారు. తర్వాత వారు పట్టణాన్ని కల్చేశారు. 9 ఆ తర్వాత యూదావారు మరికొంత మంది కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్లారు. నెగెవులోని కొండ దేశంలోను, పశ్చిమ కొండ చరియల్లోను ఆ కనానీయులు నివసించారు.
10 తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీయులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. (హెబ్రోను కిర్యతర్బా అని పిలువబడేది.) షేషయి, అహీమాను, తల్మయి[b] అనే వారిని యూదావారు ఓడించారు.
కాలేబు, అతని కుమార్తె
11 యూదా వారు ఆ చోటు విడిచిపెట్టేశారు. దెబీరులో ఉన్న ప్రజలతో యుద్ధం చేయటానికి వారు దెబీరు పట్టణం వెళ్లారు. (గతంలో దెబీరు కిర్యత్సేఫెరు అని పిలువబడింది). 12 యూదావారు యుద్ధం ప్రారంభించక ముందు, ఆ మనుష్యులకు కాలేబు ఒక వాగ్దానం చేసాడు, “కిర్యత్సేఫెరు మీద దాడిచేయాలని నేను కోరుతున్నాను. ఆ పట్టణాన్ని ముట్టడించి, దానిని పట్టుకొనేవాడికి నేను నా కుమార్తె అక్సాను ఇస్తాను. అతనిని నా కుమార్తెను వివాహం చేసుకోనిస్తాను” అని చెప్పాడు కాలేబు.
13 కాలేబుకు కనజు అనే పేరుగల చిన్న తమ్ముడు ఉన్నాడు. కనజుకు ఒత్నీయేలు అను పేరుగల ఒక కుమారుడు ఉన్నాడు. కిర్యత్సేఫెరు పట్టణాన్ని ఒత్నీయేలు పట్టుకున్నాడు. అందుచేత ఒత్నీయేలుకు భార్యగా ఉండేందుకు కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చాడు.
14 అక్సా ఒత్నీయేలుతో కాపురానికి వెళ్లింది. తన తండ్రిని కొంత భూమి అడగమని అక్సాతో చెప్పాడు ఒత్నీయేలు. అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. ఆమె తన గాడిద మీదనుండి దిగగానే, “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
15 అక్సా జవాబిచ్చింది: “నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వుము. నీవు నాకు నెగెవులో ఎండిపోయిన ఎడారి భూమి ఇచ్చావు. దయచేసి నీళ్లుగల భూమి నాకు కొంత ఇవ్వుము.” కనుక ఆమె కోరినట్టు కాలేబు ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఎగువ, దిగువ నీటి మడుగులను కాలేబు ఆమెకు ఇచ్చాడు.
16 కెనెతీ ప్రజలు అంజూరపు చెట్ల పట్టణం (యెరికో) విడిచి, యూదా ప్రజలతో వెళ్ళారు. వారు యూదా అరణ్యంలోని ప్రజలతో కలిసి జీవించటానికి అక్కడికే వెళ్లారు. అది అరాదు పట్టణానికి సమీపంగానే నెగెవులో ఉంది. (కెనెతీ ప్రజలు మోషే మామగారి కుటుంబానికి చెందినవారు).
17 కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా[c] అని పేరు పెట్టారు.
18 యూదావారు గాజా పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను పట్టుకొన్నారు. అష్కెలోను, ఎక్రోను పట్టణాలను, వాటి చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను కూడా యూదావారు పట్టుకొన్నారు.
19 యూదావారు యుద్ధం చేసినప్పుడు యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. కొండ దేశంలోని భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ లోయల్లో ఉన్న ప్రజల వద్ద ఇనుప రథాలు ఉండటం చేత ఆ భూమిని యూదావారు తీసుకోలేక పోయారు.
20 హెబ్రోను దగ్గర ఉన్న భూమిని కాలేబుకు ఇస్తానని మోషే వాగ్దానం చేసాడు. కనుక ఆ భూమి కాలేబు కుటుంబానికి ఇవ్వబడినది. కాలేబు మనుష్యులు అనాకు యొక్క ముగ్గురు కుమారులను ఆ చోటు నుండి బలవంతంగా వెళ్లగొట్టారు.
21 బెన్యామీను వంశపు వారు యెరూషలేము నుండి యెబూసీ ప్రజలను వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ బెన్యామీను ప్రజలతో బాటు యెబూసీ ప్రజలు కూడా యెరూషలేములో నివసిస్తున్నారు.
యోసేపు మనుష్యులు బేతేలును పట్టుకోవటం
22-23 యోసేపు వంశం వారు బేతేలు పట్టణం మీద యుద్ధానికి వెళ్లారు. (పూర్వం బేతేలు లూజు అని పిలువబడింది.) యోసేపు వంశం వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. యోసేపు వంశం వారు బేతేలు పట్టణానికి కొందరు గూఢాచారులను పంపించారు. (వీళ్లు బేతేలు పట్టణాన్ని ఓడించే మార్గాల కోసం వెదికారు). 24 గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమనించి చూస్తూండగా ఆ పట్టణంలో నుండి ఒక మనిషి బయటకు రావటం వారు చూశారు. ఆ గూఢచారులు, “పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని అతనితో చెప్పారు.
25 ఆ మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయోగించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం స్వేచ్ఛగా వెళ్లనివ్వబడ్డారు. 26 అతడు హిత్తీ ప్రజలు నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. ఆ పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. ఆ పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది.
మిగిలిన వంశాలు కనానీయులతో పోరాడటం
27 బేత్షెయానును, తయినాకు, దోరు, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాల్లో, ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. మనష్షే వంశం వారు ఆ ప్రజలను ఆ పట్టణాల నుండి వెళ్లగొట్టలేకపోయారు. అందుచేత కనానీయులు ఉండిపోయారు. వారు తమ గృహాలు విడిచిపెట్టేందుకు నిరాకరించారు. 28 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బలవంతులై కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలందరినీ వారి దేశంనుండి వెళ్లగొట్టలేకపోయారు.
29 (ఎఫ్రాయిము వంశం వారి విషయం కూడ అలాగే జరిగింది.) గెజెరులో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. ఎఫ్రాయిము వంశస్తులు ఆ కనాను ప్రజలందరినీ వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఎఫ్రాయిము ప్రజలతోబాటు కనాను ప్రజలు కూడ గెజెరులో నివసించటం కొనసాగించారు.
30 జెబూలూను వంశం వారి విషయంలో కూడ అలాగే జరిగింది. కిత్రోను, నహలోలు పట్టణాల్లో కొందరు కనానీయులు నివసించారు. జెబూలూను ప్రజలు ఆ మనుష్యులను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. ఆ కనానీయులు ఉండిపోయి, జెబూలూను వారితో నివసించారు. కానీ జెబూలూను వారు ఆ ప్రజలను తమకు బానిసలుగా పని చేయించుకొన్నారు.
31 (ఆషేరు వంశం వారి విషయంలో కూడా అలాగే జరిగింది.) అక్కో, సీదోను, అహ్లాబు, అక్జీబు, హెల్బా, అఫెకు, రెహోబు పట్టణాలనుండి ఇతర మనుష్యులను ఆషేరువారు వెళ్లగొట్టలేదు 32 ఆషేరువారు కనాను ప్రజలను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఆ కనానీయులు ఆషేరు ప్రజలతో కలిసి జీవించటం కొనసాగించారు.
33 (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి ఆ పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. ఆ కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.
34 అమోరీయులు, దాను వంశం వారిని కొండ దేశంలో నివసించేట్టుగా బలవంతం చేసారు. దాను ప్రజలు లోయలలో నివసించేందుకు అమోరీ ప్రజలు రానివ్వ లేదు. కనుక దాను వారు కొండలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 35 అమోరీయులు అయ్యాలోను, హెరెసు కొండలోను, షయల్బీములోను నివసించేందుకు తీర్మానించుకున్నారు. తరువాత యోసేపువంశం బలమైనదిగా పెరిగింది. అప్పుడు వారు అమోరీయులను తమకు బానిసలుగా పని చేయించుకున్నారు. 36 అమోరీయుల దేశం తేలు కనుమనుండి హస్సెలా వరకు, ఆ పైన హస్సెలాకు అవతల కొండ దేశంలోనికీ విస్తరించింది.
బోకీము దగ్గర యెహోవాదూత
2 యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను. 2 ఈ దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసుకోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.
3 “నేను మీకు చెబుతాను: ‘ఇతరులను ఇక మీదట ఈ దేశం నుండి బలవంతంగా నేను వెళ్లగొట్టను. ఈ ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా ఉంటారు.’”
4 యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు. 5 కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి బోకీము[d] అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.
అవిధేయతవలన అపజయం
6 అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు. 7 యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు. 8 నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 9 ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తిమ్నాతుహెరెసు దగ్గర ఉంది.
10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను[e] పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.
14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.
16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.[f] పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.
18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.
20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.
3 1-2 ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: 3 ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. 4 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.
5 కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. 6 ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.
మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు
7 ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా[g] అను బూటకపు దేవుళ్లను సేవించారు. 8 ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము[h] రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. 9 కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు. 10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు. 11 అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.
న్యాయమూర్తి ఏహూదు
12 ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. 13 అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. 14 ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.
15 ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. 16 ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.
17 ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) 18 ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 19 ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు.
ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. 20 ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు.
అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. 21 రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు. 22 ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహూదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.
23 ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు. 24 ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు. 25 అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.
26 ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు. 27 ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు. 28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు.
కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. 29 మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 30 కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.
న్యాయమూర్తి షమ్గరు
31 ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.
సైతాను యేసును శోధించటం
(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)
4 యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. 2 అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
3 సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.
4 యేసు,
“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)
5 ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. 6 ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. 7 నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.
8 యేసు,
“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)
అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
9 సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.
10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)
11 అంతేకాక:
‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)
అని వ్రాయబడింది” అని అన్నాడు.
12 యేసు,
“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)
అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)
14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. 15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)
16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19 ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(F)
20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.
23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.
25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”
28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.
© 1997 Bible League International