మత్తయి 4:1-11
Telugu Holy Bible: Easy-to-Read Version
యేసుకు కలిగిన పరీక్షలు
(మార్కు 1:12-13; లూకా 4:1-13)
4 ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. 2 అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. 3 సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు.
4 యేసు సమాధానంగా,
“‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు.
కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’(A)
అని వ్రాసారు” అని అన్నాడు.
5 ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, 6 “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే,
‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు.
వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా
నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’(B)
అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు.
7 యేసు వానితో,
“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’(C)
అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు.
8 సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, 9 “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు.
10 యేసు:
“సైతానా! నా ముందునుండి వెళ్ళిపో!
ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’(D)
అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు.
11 అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.
Read full chapter© 1997 Bible League International