Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 16-18

పస్కా పండుగ

16 “అబీబు[a] నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి యింటిలో పులిసిన రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి.

“మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు. మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది. మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి. పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.

వారాల పండుగ (పెంతెకొస్తు)

“మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి. 10 అప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు జరుపుకోవాలి. ఒక స్వేచ్ఛార్పణ తీసుకొని రావటంతో దీనిని జరుపుకోండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి. 11 యెహోవా తన ప్రత్యేక ఆలయంగా ఏర్పచుకొనే చోటుకు వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలిసి అక్కడ మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్లండి. అంతే కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీయులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవలను కూడ తీసుకొని వెళ్లండి. 12 మీరు ఈజిప్టులో బానిసలు అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధేయులు కావాలి.

పర్ణశాలల పండుగ

13 “మీ ధాన్యపు కళ్లమునుండి, మీద్రాక్ష గానుగ నుండి మీరు మీ పంటను కూర్చుకొనే ఏడు రోజులకు పర్ణశాలల పండుగ మీరు జరుపుకోవాలి. 14 మీరూ, మీ కుమారులు, మీ కుమారైలు, మీ సేవకులందరూ, మీ పట్టణల్లో నివసించే లేవీయులు, విదేశీయులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవలు ఈ పండుగలో సంతోషంగా గడపండి. 15 యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజులపాటు ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు దీనిని చేయండి. మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు చేసిన పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా సంతోషించండి.

16 “మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకొనేందుకు సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులంతా రావాలి. ఇది పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగలప్పుడు సంభవిస్తుంది. యెహోవాను కలుసుకొనేందుకు వచ్చే ప్రతి వ్యక్తీ ఒక కానుక తీసుకొని రావాలి. 17 ప్రతి మనిషీ ఇవ్వగలిగినంత ఇవ్వాలి. యెహోవా తనకి ఎంత ఇచ్చాడో అనేది గ్రహించి, తాను ఎంత ఇవ్వాలో నిర్ణయించాలి.

ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు

18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి. 19 న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది. 20 మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.

విగ్రహాలు దేవునికి అసహ్యం

21 “మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం నిలబెట్టినప్పుడు, అషెరా[b] దేవతను ఘనపర్చే చెక్క స్తంభాలు ఏవీ బలిపీఠం పక్కగా మీరు నిలబెట్టకూడదు. 22 మరియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు.

బలులకు మంచి జంతువులనే ఉపయోగించాలి

17 “ఏదైనా దోషం ఉన్న ఆవునుగాని, గొర్రెనుగాని మీరు మీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యం.

విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష

“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషడు లేక ఒక స్త్రీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు మీరు వినవచ్చును. వారు యెహోవా ఒడంబడికను తప్పిపోయినట్టు వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. ఇలాంటి దుర్వార్త మీరు వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘటన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలసుకోవాలి. అది వాస్తవమని మీకు ఋజువైతే ఆ చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి. ఆయితే ఆ వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి. ఆ వ్యక్తిని చంపటానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్యనుండి ఆ చెడును నిర్మూలించాలి.

కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు

“మీ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతరమైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యానేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. లేక యిద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి హాని కలిగిన విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి. లేవీ వంశానికి చెందిన యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు. 10 అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి. 11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.

12 “ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహోవాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షించాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడుగును మీరు అరికట్టాలి. 13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు.

రాజును ఎన్నుకోవడం ఎలా?

14 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశాన్ని స్వాధినం చేసుకొని దానిలో మీరు నివసిస్తారు. అప్పుడు మీరు ‘మా చుట్టూ ఉన్న రాజ్యాలలాగే మాకూ ఒక రాజును మేము నియమించుకొంటాము’ అంటారు. 15 అలా జరిగినప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన రాజునే మీరూ ఏర్పరచుకోవాలి. మీ మీద వుండే రాజు మీ ప్రజల్లో ఒకడై ఉండాలి. ఒక విదేశీయుణ్ణి మీరు రాజుగా చేయకూడదు. 16 రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొని వచ్చేందుకు అతడు ఈజిప్టుకు మనుష్యులను పంపకూడదు. ఎందుకంటే ‘మీరు ఎప్పుడూ తిరిగి ఆ మార్గాన వెళ్లకూడదు’అని యెహోవా మీతో చెప్పాడు గనుక. 17 మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది అతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.

18 “ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి అతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి. 19 రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. అతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ అతడు నేర్చుకొంటాడు. 20 అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. అతడు ధర్మశాస్త్రానికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, అతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.

యాజకులను, లేవీయులను బలపరచటం

18 “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకుల సేవ చేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే. ఇతర వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు.

“మీరు ఒక ఆవును, ఎద్దును, లేక గొర్రెను బలిగా చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్ట మీరు యాజకులకు ఇవ్వాలి. మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. మీ గొర్రెలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు లేవీయులకు ఇవ్వాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకులుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని ఏర్పరచుకొన్నాడు.

“ఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీయుడు యెహోవా నియమించిన స్థలానికి తన ఇష్ట మున్నప్పుడెల్ల రావచ్చు. అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయవచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయులందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి. ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుంబానికి వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను సమానంగా వాటా వస్తుంది.

ఇశ్రాయేలీయులు ఇతర జనాంగములను అనుసరించకూడదు

“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు. 10 మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసికొనేందుకు ప్రయత్నించవద్దు. 11 ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. 12 అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు. 13 మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.

యెహోవాయొక్క ప్రత్యేక ప్రవక్త

14 “మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు. 15 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను[c] పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి. 16 దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సీనాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కొండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నిని మాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.

17 “యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే. 18 నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు. 19 ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’

బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా?

20 “అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే. 21 ‘ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది కాదు అని మనం ఎలా తెలుసు కోగలము’ అని మీరు తలుస్తూ ఉండవచ్చు. 22 ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.

మార్కు 13:1-20

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మత్తయి 24:1-25; లూకా 21:5-24)

13 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు.

యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు.

యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు.

యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట.

“మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. 11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.

12 “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. 13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.

14 “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే[a] యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి. 15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు. 16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు.

17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! 18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. 19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. 20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International