Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 7-9

ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు

“మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను – హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు. ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు. ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు. ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.

బూటకపు దేవుళ్లను నాశనం చేయండి

“ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆషేరు స్తంభాలను[a] నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి. ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు – కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు. యెహోవా ఎందుకు ప్రేమించి, ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే అతి తక్కువ సంఖ్యవారు. అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.

“అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు. 10 అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు. 11 కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు నియమాలు విధేయత చూపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

12 “మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగ్రత్తగా విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ప్రేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకులకు ఆయన యిది వాగ్దానం చేసాడు. 13 ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆశిర్వదిస్తాడు. మీ ప్రజల సంఖ్య యింకా యింకా పెరిగిపోతుంది. ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె ఆయన మీకు ఇస్తాడు. మీ ఆవులకు దూడలను, గొర్రెలకు గొర్రె పిల్లలను ఇచ్చి ఆయన ఆశీర్వాదిస్తాడు. మీకు ఇస్తానని ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీకు ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి.

14 “ప్రజలదరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. భార్వాభర్తల ప్రతి జంటకూ పిల్లలు పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి. 15 సమస్త రోగాలనూ యెహోవా మీ నుండి తొలగించివేస్తాడు. ఇంతకు ముందు ఈజిప్టులో మీకు కలిగిన భయంకర వ్యాధులు ఏవీ ఆయన మీకు రానివ్వడు. కానీ ఈ వ్యాధులన్నింటిని మిమ్మల్ని ద్వేషించేవారిమీద ఆయన ఉంచుతాడు. 16 మీరు ఎవరిని ఓడించేందుకు మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి పడవద్దు. మరియు వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందుకంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు.

యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుట

17 “‘ఈ రాజ్యాలు మనకంటే బలమైనవి. వారిని మనం ఎలా వెళ్లగొట్టగలము?’ అని మీ హృదయంలో అనుకోవద్దు. 18 వారిని గూర్చి మీరు భయపడకూడదు. ఫరోకు, ఈజిప్టు ప్రజలందరికి మీ దేవుడైన యెహోవా చేసిన దానిని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 19 ఆయన వారికి కలిగించిన మహా కష్టాలను మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చూశారు. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించేందుకు యెహోవా ప్రయోగించిన ఆయన మహాశక్తిని, బలాన్ని మీరు చూశారు. మీరు భయపడే వారందరి మీదా అదే శక్తిని మీ దేవుడైన యెహోవా ప్రయోగిస్తాడు.

20 “మీ దగ్గర్నుండి పారిపోయి, దాక్కున్న వాళ్లందరినీ పట్టుకొనేందుకు మీ దేవుడైన యెహోవా కందిరీగలను సహా పంపిస్తాడు. ఆ ప్రజలందరినీ దేవుడు నాశనం చేస్తాడు. 21 మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గనుక వారినిగూర్చి భయపడవద్దు. ఆయన మహా గొప్పవాడు, భీకరుడునైన దేవుడు. 22 ఆ రాజ్యాల ప్రజలు మీ దేశాన్ని కొంచెంకొంచెంగా విడిచి వెళ్లి పోయేటట్టు మీ దేవుడైన యెహోవా వారిని బలవంతపెడ్తాడు. వాళ్లందరినీ ఒకేసారిగా మీరు నాశనం చేయరు. మీరు అలా చేస్తే మీకు అడవి మృగాల బాధ విపరీతంగా పెరిగిపోతుంది. 23 అయితే మీ దేవుడైన యెహోవా ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు. వారు నాశనం అయ్యేంతవరకు గొప్ప చిక్కుతో యెహోవా వారిని యుద్ధంలో గందరగోళ పరుస్తాడు. 24 వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.

25 “మీరు వారి దేవుళ్ల విగ్రహాలను తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే బంగారంకానీ వెండి గానీ మీరు తీసుకొంటే బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ జీవితాలు నాశనం అవుతాయి) ఎందుకంటే మీ యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అసహ్యం. 26 యెహోవా అసహ్యించుకొనే ఆ విగ్రహాల్లో ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూడదు. ఆ విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, ఆ విగ్రహాలవలె మీరు కూడా నాశనం చేయబడతారు. మీరు వాటిని బాగా అసహ్యించుకోవాలి. ఆ విగ్రహాలను నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.

యెహోవాను జ్ఞాపకం చేసుకోండి

“ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు. యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో[b] మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు. గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు. ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.

“మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి. నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు. అది గోధుమ, యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. 10 మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.

యెహోవా చేసినదాన్ని మరచిపోకండి

11 “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. 12 మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. 13 మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. 14 అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. 15 భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. 16 మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. 17 ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. 18 మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక.

19 “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. 20 దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.

యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు

“ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు యొర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి. అక్కడి ప్రజలు ఎత్తయిన వాళ్లు, బలం ఉన్నవాళ్లు. వారు అనాకీయ ప్రజలు. ఆ ప్రజలను గూర్చి మీకు తెలుసు. ‘అనాకీయ ప్రజల మీద ఎవడూ గెలవలేడు’ అని మన గూఢచారులు చెప్పటం మీరు విన్నారు. అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు.

“ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే. మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు. మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు.

యెహోవా కోపాన్ని జ్ఞాపకం చేసుకోండి

“అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశంనుండి బయటకు వెళ్లిన రోజునుండి ఈ చోటికి వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడుటకు నిరాకరించారు. ఇంకా హొరేబు కొండ దగ్గర కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది యెహోవకు. రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 10 అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వ్రేలితో వ్రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్ని ఆయన రాసాడు.

11 “కనుక 40 పగళ్లు 40 రాత్రుళ్లు ఆయిపోగానే, ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు ఇచ్చాడు. 12 అప్పుడు ‘లేచి త్వరగా ఇక్కడనుండి క్రిందికి వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకొన్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం ఒక విగ్రహం చేసుకొన్నారు’ అని యెహోవా నాతో ఇలా చెప్పాడు.

13 “ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు. 14 వారి పేర్లనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలుకంటె ఎక్కువ బలం గల యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ జేస్తాను.’

బంగారు దూడ

15 “అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి క్రిందికి వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి. 16 నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు. 17 అందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరుగగొట్టేసాను. 18 అప్పుడు నేను మొదటిసారిలాగ 40 పగళ్లు, 40 రాత్రుళ్లు యెహోవా యెదుట నేలమీద సాష్టాంగ పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను యిలా చేసాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయనకు కోపం పుట్టించారు. 19 యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు. 20 అహరోనును నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను. 21 మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను.

ఇశ్రాయేలీయులను క్షమించమని మోషే దేవుణ్ణి అడగటం

22 “మరియు మీరు తబేరావద్ద, మస్సావద్ద, కిబ్రోత్ హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. 23 మీరు కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా చెప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. ‘మీరు వేళ్లి నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి’ అని ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. మీరు ఆయన ఆజ్ఞను వినలేదు. 24 నేను మిమ్మల్ని ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయలయ్యేందుకు నిరాకరిస్తున్నారు.

25 “కనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 రాత్రుళ్లు సాష్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేస్తానని యెహోవా చేప్పాడు గనుక. 26 నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు. 27 నీ సేవకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు. 28 నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో. 29 ఆయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు చేందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.’

మార్కు 11:19-33

19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మత్తయి 21:20-22)

20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” 26 [a]

యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 21:23-27; లూకా 20:1-8)

27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. 28 వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు.

29 యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.

31 వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. 32 మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు.

33 కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.

యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International