Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 7-8

మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, (గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది.

అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడించేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయబోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను మరచిపోవటం నాకు ఇష్టం లేదు. కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు.

ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు.

“ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి తీసుకుని వెళ్లు, అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెబితే అతడు వెళతాడు. కాని నేను, ‘అతడు నీతో వెళ్లడు’ అని అంటే ఆ మనుష్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో యెహోవా చెప్పాడు.

కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులను ఈ విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్లు గతుకుతూ నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా చేయబడాలి.”

నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులనుపయోగించి కుక్క గతికినట్లు గతికిన వారు మూడు వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి నీళ్లు త్రాగారు. యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు.

కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు.

గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను. రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు. 10 ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. 11 మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.”

కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు. 12 మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది.

13 గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెబుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు.

14 ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు.

15 ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. 16 అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. 17 అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. 18 మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’”

19 కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది మనుష్యులు వారి శత్రువుల విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు. 20 అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు.

21 గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. 22 గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.

23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు. 24 ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు.

కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలిచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు. 25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.

ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.

ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా? (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.

మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు

అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో[a] ఉన్నారు, “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.

కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.

అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.

గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు. కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.

10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు. 11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు. 12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.

13 అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. 14 గిద్యోను సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టుకొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్లు వ్రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద మనుష్యుల పేర్లు ఆ యువకుడు వ్రాసిపెట్టాడు. డెభ్భై ఏడు మంది పేర్లు అతడు ఇచ్చాడు.

15 అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు. 16 గిద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు. 17 పెనూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టణంలో నివసించేవారిని చంపివేశాడు.

18 అప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” అని జెబహు, సల్మున్నాలను అడిగాడు.

“ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, సల్మున్నాలు జవాబు ఇచ్చారు.

19 “ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమారులు! యెహోవా తోడు, మీరు గనుక వారిని చంపి ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను” అన్నాడు.

20 అప్పుడు గిద్యోను యెతెరువైపు తిరిగాడు. గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. “ఈ రాజులను చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు.

21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.

గిద్యోను ఏఫోదును తయారు చేయుట

22 ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే మమ్మల్ని పాలించు. నీవూ, నీ కుమారుడు, నీ మనుమళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరుతున్నాము” అని గిద్యోనుతో చెప్పారు.

23 అయితే గిద్యోను, “యెహోవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

24 ఇశ్రాయేలు వారు ఓడించిన మనుష్యులలో కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మనుష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: “మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు ప్రజలతో చెప్పాడు.

25 కనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది మేము సంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు. 26 ఆ బంగారు పోగులు ప్రోగు చేయబడినప్పుడు వాటి బరువు నలభై మూడు పౌనులు (1,700 తులములు) అయినది. ఇష్మాయేలు ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చంద్రాకారములో ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసులను కూడ వారు అతనికి ఇచ్చారు.

27 ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఆ ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.

గిద్యోను మరణం

28 మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన క్రింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు దేశంలో శాంతి ఉంది.

29 యోవాషు కుమారుడైన యెరుబ్బయలు (గిద్యోను) ఇంటికి వెళ్లాడు. 30 గిద్యోనుకు డెబ్బై మంది సొంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు ఉన్నారు. 31 గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.

32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవాషుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఆ సమాధి అబీయెజ్రీ వంశం వారు నివసించే ఒఫ్రా పట్టణంలో ఉంది. 33 గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు వారి దేతవగా చేసుకున్నారు. 34 ఇశ్రాయేలు ప్రజలు చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 35 యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు.

లూకా 5:1-16

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)

ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు. యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.

ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.

సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.

సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు.

యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.

11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.

యేసు రోగిని నయం చేయటం

(మత్తయి 8:1-4; మార్కు 1:40-45)

12 యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు.

13 యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. 14 ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు.

15 కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. 16 కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International