Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 19-21

భద్రతా పట్టణాలు

19 “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆ రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ఆ ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగినప్పుడు, 2-3 దేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. తర్వాత ఒక్కో ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా ఉండేటట్టు ఆ భాగంలో ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఆ పట్టణాలకు మీరు త్రోవలు వేయాలి. ఒక వ్యక్తిని చంపిన ఏ వ్యక్తిగాని అక్కడికి పారిపోవచ్చును.

“ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు. ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విసరిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును. అయితే ఆ పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను చంపిన మనిషి బంధువు ఎవరైన అతణ్ణి తరిమి, అతడు ఆ పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. ఆ దగ్గర బంధువు చాలా కోపంతో అతణ్ణి చంపివేయ వచ్చును. కానీ ఆ మనిషి మరణ పాత్రుడుకాడు. అతడు చంపినవాణ్ణి అతడు ద్వేషించలేదు. కనుక ఈ పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవాల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

“మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని విస్తరింపచేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీకులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయన మీకు ఇస్తాడు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ బడాలి. 10 అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక ప్రజలు చంపబడరు. మరియు ఏ మరణం విషయంలోనూ మీరు దోషులుగా ఉండరు.

11 “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని చంపేసి భద్రతకోసం ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు. 12 అలా జరిగితే అతని స్వగ్రామంలోని పెద్దలు ఎవరినైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి తీసుకొని వెళ్లిపోవాలి. అతణ్ణి శిక్షించాల్సిన బాధ్యత గల బంధువులకు ఆ పెద్దలు అప్పగించాలి. ఆ హంతకుడు మరణించాలి. 13 అతని కోసం మీరు విచారించకూడదు. నిర్దోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీయులను మీరు తప్పించాలి. అప్పుడు మీకు అంతా మేలు అవుతుంది.

ఆస్తుల సరిహద్దులు

14 “నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయకూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు ఈ సరిహద్దు రాళ్లను పెట్టారు.

సాక్ష్యాలు

15 “ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దోషి అని నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం.

16 “ఒక సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని మీద అబద్ధం చెప్పి, అతనికి హాని చేయాలని చూడవచ్చును. 17 అప్పుడు ఒకరితో ఒకరు వాదించుకొంటున్న ఆ ఇద్దరు వ్యక్తులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి. 18 న్యాయ మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి వ్యక్తిమీద అబద్ధాలు చెప్పినట్టు వారు తెలుసుకోవచ్చు. ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే 19 మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి. 20 మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు.

21 “తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. (నేరస్థునికి శిక్ష విధించినట్టుగానే).

యుద్ధ నియమాలు

20 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు, మీకంటె ఎక్కువ గుర్రాలు, రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు.

“యుద్ధానికి మీరు దగ్గరగా వెళ్లినప్పుడు యాజకుడు సైనికుల దగ్గరకు వెళ్లి, వారితో మాట్లాడాలి. యాజకుడు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు మనుష్యులారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శ్రతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. మీ ధైర్యం విడువవద్దు. కలవరపడవద్దు. శత్రువునుగూర్చి భయపడవద్దు. ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’

“లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు. ద్రాక్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చుకొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొకడు అనుభవిస్తాడు. వివాహం కోసం ప్రధానం జరిగినవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకొంటాడు.’

“ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన సైనికులుకూడా ధైర్యం కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాడు.’ తర్వాత అధికారులు సైన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, సైన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.

10 “మీరు ఒక పట్టణం మీద దాడి చేయక ముందు అక్కడి ప్రజలకు మీరు శాంతి రాయబారం పంపించాలి. 11 మీ రాయబారాన్ని వారు అంగీకరించి, వారి గుమ్మాలు తెరచినట్లయితే ఆ పట్టణంలోని ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్లవుతారు. మీకు బానిసలై మీకు పని చేయవలసివస్తారు. 12 అయితే ఆ పట్టణం మీతో సమాధానపడేందుకు నిరాకరించి మీతో పోరాడితే అప్పుడు మీరు ఆ పట్టణాన్ని చుట్టుముట్టాలి. 13 మరియు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆ పట్టణం స్వాధీనం చేసుకోనిచ్చినప్పుడు, మీరు దానిలోని పురుషులందరినీ చంపివేయాలి. 14 ఆయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకోవచ్చును. మీ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు. 15 మీరు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి.

16 “ఆయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని పట్టణాలను మీరు స్వాధీనం చేసుకొన్నప్పుడు ప్రతి ఒక్కరినీ మీరు చంపేయాలి. 17 హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు. 18 ఎందుకంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయమని వారు మీకు నేర్పించజాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్పించరు.

19 “మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫలవృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. ఈ చెట్లు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో యుద్ధం చేయవద్దు. 20 ఆయితే ఫలాలు ఇవ్వని చెట్లు అని మీకు తెలిసిన వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసేందుకు ఈ చెట్లను మీరు ఉపయోగించ వచ్చును. ఆ పట్టణం పతనం ఆయ్యేంత వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చును.

ఒకడు హత్య చేయబడి ఉంటే

21 “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కాని ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి. చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, ఆ పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి. అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి. లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.) ఆ శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి. ఈ నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు నిందించబడరు. అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు.

యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలు

10 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొనిపోతారు. 11 ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు. 12 అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి. 13 ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది. 14 కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక.

జ్యేష్ఠ కుమారడు

15 “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ అతనికి పిల్లలను కనవచ్చును. అతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును. 16 అతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైనవాటిని, తాను ప్రేమించే భార్య కుమారునికి అతడు ఇచ్చివేయకూడదు. 17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను అతడు స్వీకరించాలి. అతడు అన్నింటిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ అతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది.

లోబడేందుకు తిరస్కరించే కుమారులు

18 “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. అయినప్పటికీ వారి మాట అతడు నిరాకరిస్తాడు. 19 అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి. 20 ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారుడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని, తాగుతున్నాడు.’ 21 అప్పుడు ఆ పట్టణంలోని మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.

నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం

22 “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత అతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి. 23 అలా జరిగినప్పుడు అతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు.

మార్కు 13:21-37

21 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి. 22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు. 23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను.

24 “కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో,

‘సూర్యుడు చీకటైపోతాడు.
    చంద్రుడు తన వెలుగును వెదజల్లడు.
25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి.
    ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’(A)

26 “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. 27 ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు.

28 “అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. 29 అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు. 30 ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును. 31 ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు.

32 “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి.[a] ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు.

34 “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. 36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International