Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 4-6

స్త్రీ న్యాయమూర్తి దెబోరా

చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు.

దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”

అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు.

“ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది.

కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. 10 కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.

11 కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.

12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 13 కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.

14 అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. 15 బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 16 బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.

17 కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు. 18 సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.

19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.

20 అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.

21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.

22 సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.

23 ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు. 24 కనుక ఇశ్రాయేలు ప్రజలు కనాను రాజు యాబీనును ఓడించటంతో మరింత బలవంతులయ్యారు. కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలు చివరికి నాశనం చేసారు.

దెబోరా గీతం

ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:

“ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు.
    యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి.

“రాజులారా, వినండి.
    అధికారులారా గమనించండి!
నేను పాడుతాను.
    నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను.
యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి
    నేను సంగీతం గానం చేస్తాను.

“యెహోవా, గతంలో నీవు శేయీరు[a] దేశం నుండి వచ్చావు.
    ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు.
నీవు నడువగా భూమి కంపించింది.
    ఆకాశాలు వర్షించాయి.
    మేఘాలు నీళ్లు కురిపించాయి.
సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట
    ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి.

“అనాతు కుమారుడు షమ్గరు[b] రోజుల్లో యాయేలు రోజుల్లో,
    రహదారులు ఖాళీ అయ్యాయి.
    ప్రయాణీకుల ఒంటెలు వెనుక దారుల్లో వెళ్లాయి.

“దెబోరా, నీవు వచ్చేవరకు,
    ఇశ్రాయేలుకు నీవు ఒక తల్లిగా వచ్చేవరకు
    సైనికులు లేరు ఇశ్రాయేలులో సైనికులు లేరు.

“వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు.
    అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది.
నలభైవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో
    ఎవరివద్దా ఒక డాలుగాని, బల్లెంగాని లేదు.

“నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది.
    ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు.
యెహోవాను స్తుతించండి!

10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా,
    వాటి వీపు మీద తివాచీ[c]
    లపై కూర్చొనే ప్రజలారా,
    దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి!
11 యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య
    యెహోవా సైనికుల విజయాలను గూర్చి
యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్లో పోరాడేందుకు వెళ్లినప్పటి విషయాలను గూర్చి
    పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకొంటున్నారు.

12 “దెబోరా మేలుకో, మేలుకో!
    మేలుకో, మేలుకో, ఒక పాట పాడు!
బారాకూ లెమ్ము!
    అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!

13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు.
    యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.

14 “అమాలేకు కొండ దేశంలో
    ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు.
బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ,
    నీ ప్రజలను వెంబడించారు.
మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు.
    జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు.
15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు.
    ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు.
    ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు.

“రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చున్నారు?
రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు.
    కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు.
17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు.
దాను ప్రజలారా,
    మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు?
ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు.
    క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.

18 “కానీ జెబూలూను మనుష్యులు
    నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు.
    కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు.
కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు.
20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి.
    నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి.
21 కీషోను నది ప్రాచీన నది.
    ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది.
నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
22 గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి.
    సీసెరా బలమైన గుర్రాలు పరుగులు తీసాయి.

23 “‘మేరోజు అను పట్టణాన్ని శపించండి’
అని యెహోవాదూత చెప్పాడు.
    ‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు,
    యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’
24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు.
    ఆమె స్త్రీలలో దీవెన నొందును.
25 సీసెరా నీళ్లను అడిగెను.
    యాయేలు అతనికి పాలను ఇచ్చెను.
తరువాత సర్దారులకు తగిన పాత్రతో
    మీగడ తెచ్చియిచ్చెను.
26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను.
    పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను.
తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను.
    అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను.
27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు
    అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు!
ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు.
    అతడు పడిపోయాడు!
సీసెరా ఎక్కడ పడ్డాడో
    అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!

28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది.
    సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది,
‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది?
    అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’

29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు జవాబిస్తుంది.
    అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
30 ‘నిశ్చయంగా వారు గెలిచారు!
    వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు!
వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు!
    ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు.
ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో.
    అదీ సంగతి! విజయశాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’

31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక!
    కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!”

ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.

మిద్యానీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుట

యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రాయేలు ప్రజలు మరల చేసారు. అందుచేత యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు.

మిద్యాను ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండలలో దాగుకొనే స్థలాలు అనేకం చేసుకున్నారు. వారి భోజనాన్ని గుహలలోను, కనుక్కొనేందుకు కష్టతరమైన స్థలాలలోను దాచుకున్నారు. తూర్పు ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్లప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక వారు అలా చేశారు. ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు. మిద్యానీయులు వచ్చి ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు. మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.

మిద్యానీయులు[d] ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’ 10 ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.”

యెహోవాదూత గిద్యోనును దర్శించటం

11 ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, 12 యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు.

13 అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.”

14 యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు.

15 అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు.

16 యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.

17 అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహోవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు. 18 దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.”

యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు.

19 కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు.

20 దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు.

21 యెహోవాదూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవాదూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవాదూత అదృశ్యమయ్యాడు.

22 గిద్యోను తాను యెహోవాదూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవాదూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు.

23 కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు.

24 కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజ్రీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.

గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టటం

25 అదే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము ప్రక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు. 26 అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఆ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”

27 కనుక గిద్యోను తన సేవకులు పది మందిని తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయపడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యెహోవా చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు.

28 మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.

29 ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో తెలిసికొనేందుకు ప్రయత్నించారు.

“యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు.

30 కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.

31 అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడైనా బయలు పక్షం వహిస్తే ఉదయానికల్లా వాడు చంపబడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని బలిపీఠాన్ని ఎవరైనా పడగొట్టుతున్నప్పుడు తనను తానే కాపాడుకోవాలి” అని యోవాషు చెప్పాడు. 32 “ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు[e] అని ఒక కొత్త పేరు పెట్టాడు.

గిద్యోను మిద్యాను ప్రజలను ఓడించటం

33 మిద్యాను, అమాలేకు తూర్పు ప్రాంతపు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లి యెజ్రెయేలు లోయలో నివాసం చేశారు. 34 యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు. 35 మనష్షే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కావాలని ఆ వార్తాహరులు మనష్షే మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వంశాలకు కూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యులను కలుసుకొనటానికి వెళ్లారు.

36 అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు! 37 నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”

38 సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.

39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.

40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.

లూకా 4:31-44

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 1:21-28)

31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.

33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.

36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.

యేసు పేతురు అత్తను నయం చేయటం

(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)

38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.

యేసు అనేకులను నయం చేయటం

40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.

యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం

(మార్కు 1:35-39)

42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.

44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International