Old/New Testament
ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు
4 ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: 2 “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. 3 నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”
4 కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. 5 యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. 6 ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. 7 యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”
8 కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యొర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు. 9 (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)
10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 11 ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.
12 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు. 13 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.
14 ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు.
15 ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే, 16 “యాజకులను నదిలోనుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యెహోషువతో చెప్పాడు.
17 కనుక యెహోషువ యాజకులకు, “యొర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు.
18 యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి.
19 మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు 20 యొర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు. 21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు 22 ‘ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి. 23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యొర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. 24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”
5 కనుక ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది.
ఇశ్రాయేలీయులు సున్నతి చేయబడ్డారు
2 ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి[a] చేయి” అని యెహోషువతో చెప్పాడు.
3 కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేసాడు. తర్వాత గిబియత్ హార్లత్[b] దగ్గర అతడు వారికి సున్నతి చేసాడు.
4-7 ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి చేసాడంటే; ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు వదిలి పెట్టిన తర్వాత, సైన్యానికి తగిన వాళ్లందరికీ సున్నతి చేయబడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు చాల మంది యెహోవా మాట వినలేదు. అందుచేత “పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని” ఆ మనుష్యులు చూడరని యెహోవా ప్రమాణం చేసాడు. ఆ దేశాన్ని మనకు ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసాడు కానీ ఆ మనుష్యుల మూలంగా ప్రజలంతా 40 సంవత్సరాలపాటు అరణ్యంలోనే సంచరించాల్సి వచ్చింది. అలా ఆ సైన్యం, వాళ్లంతా చావాల్సి ఉంది. పోరాడే ఆ మనుష్యులంతా చనిపోయారు. వారి కుమారులు వారి స్థానాలు వహించారు. అయితే ఈజిప్టునుండి వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలురకు ఎవ్వరికి సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి సున్నతి చేసాడు.
8 ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయటం ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు ఆ గుడారాలలోనే ఉండిపోయారు.
కనానులో మొదటి పస్కా పండుగ
9 ఆ సమయంలో యెహోవా, “మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు[c] అని యెహోషువ పేరు పెట్టాడు. నేటికీ ఆ చోటు గిల్గాలు అనే పిలువబడుతోంది.
10 ఇశ్రాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్గాలులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు. అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం. 11 మరునాడు పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు. 12 ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.
యెహోవా సైన్యాధిపతి
13 యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.
14 ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి, “నా యజమానీ, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు.
15 అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.
6 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.
2 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు. 3 నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి. 4 పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు. 5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”
యెరికోతో యుద్ధం
6 కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.
7 “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
8 యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. 9 ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. 10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.
11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.
12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. 13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. 14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! 17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే.[d] వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. 18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. 19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”
20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. 21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.
22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”
23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.
24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి. 25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.
26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు:
“ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే
వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు.
ఈ పట్టణానికి పునాది వేసే మనిషి
తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు.
ద్వారాలు నిలబెట్టేవాడు
తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”
27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.
యేసు జీవన చరిత్రను లూకా వ్రాయటం
1 గౌరవనీయులైన థెయొఫిలాకు:
మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు. 2-3 వీటన్నిటినీ నేను మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు కూడా వీటన్నిటిని క్రమపద్ధతిలో వ్రాసి మీకు అందించటం ఉత్తమమనిపిం చింది. 4 మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను.
జెకర్యా మరియు ఎలీసబేతు
5 హేరోదు[a] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా[b] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. 6 ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, 7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.
8 తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. 9 దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.
11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ[c] ఉంటాడు.
16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో[d] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.
18 జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.
19 దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు. 20 జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”
© 1997 Bible League International