Old/New Testament
ఆకాను పాపం
7 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి[a] పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
3 తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
4-5 కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు.
ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు. 6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. 8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు. 9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు? 11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు. 12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
14 “‘రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలూ యెహోవా యెదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో నుండి ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు. 15 మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.’”
16 మర్నాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యోహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు. 17 కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని యెహోవా నిర్ణయం చేసాడు. అప్పుడు జెరహు వంశంలోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్ది కుటుంబం నిర్ణయించబడింది. 18 అప్పుడు ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదుటికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారుడైన ఆకానును యెహోవా నిర్ణయం చేసాడు. (జిమ్రి కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది).
19 అప్పుడు ఆకానుతో యెహోషువ అన్నాడు: “నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు ప్రయత్నించకు!”
20 ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే, 21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ క్రిందనే ఉంది.”
22 కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ క్రిందనే ఉంది. 23 ఆ మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుపలికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారు యెహోవా ఎదుట వాటిని నేలమీద పెట్టారు.
24 అప్పుడు యెహోషువ, ప్రజలందరూ కలిసి జెరహు కుమారుడు ఆకానును ఆకోరు[b] లోయకు తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికి ఉన్న సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు. 25 అప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదాన్నంతటినీ ప్రజలు కాల్చివేసారు. 26 వారు ఆకానును కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. (కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు.
హాయి నాశనమగుట
8 అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. 2 నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”
3 కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు. 4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి. 5 నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యులు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివరకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం. 6 ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము. 7 అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.
8 “యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”
9 అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు. 11 యెహోషువతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు. 13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.
15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు. 16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు. 17 హాయి, బేతేలు ప్రజలంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండలేదు.
18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు. 19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.
20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తరమటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది. 21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటం వారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు. 22 అప్పుడు దాగుకొనియున్న మనుష్యులు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు. 23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.
యుద్ధాన్ని గూర్చి ఆలోచించటం
24 యుద్ధ సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రాయేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్లందరినీ వారు చంపేసారు. 25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు 26 ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. ఆ పట్టణంలోని ప్రజలందరూ నాశనం చేయబడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు. 27 ఆ పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచుకొన్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు.
28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది. 29 హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
ఆశీర్వాదాలు మరియు శాపాలను చదవటం
30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు. 31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసాడు. కనుక మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు. 33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారి ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు. 35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.
గిబియోనులు యెహోషువకు చేసిన మోసం
9 యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, కనానీ, పెరిజ్జీ, హివ్వీ, యెబూసీ ప్రజల రాజులు వీరు. వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకూ కూడ వారు నివసించారు. 2 ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.
3 యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు. 4 కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను[c] వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు. 5 ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయి, విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు. 6 అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది.
ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.
7 ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారితో చెప్పారు.
8 హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు.
అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.
9 అప్పుడు ఆ మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని గూర్చి మేము విన్నాం. 10 యొర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. 11 కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.
12 “మా రొట్టెలు చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇవి ఎండిపోయి ఉన్నట్లు మీరు చూడగలరు. 13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”
14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు. 15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.
16 మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి గుడారాలకు చాల దగ్గర్లో నివసిస్తున్నవారేనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొన్నారు. 17 కనుక వాళ్లు నివసిస్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫిరా, బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. 18 కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేసారు.
ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు. 19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మేము మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు మేము వాళ్లతో యుద్ధం చేయలేము. 20 మనము ఇలా చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మనమీద ఉంటుంది. 21 అందుచేత వాళ్లను బ్రతక నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. వాళ్లు మనకోసం కట్టెలు కొట్టి, మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.
22 యెహోషువ గిబియోను ప్రజలను పిలిచి, “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు. 23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.
24 గిబియోనీ ప్రజలు ఇలా జవాబు చెప్పారు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము. 25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”
26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యెహోషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ. 27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.
21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.
24 కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు. 25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.
యేసు జన్మిస్తాడని ప్రవచనం
26 ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు. 27 దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ. 28 ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.
29 దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.
30 ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. 31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32 ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”
34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.
35 ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 36 నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. 37 దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”
38 మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International