Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 9-10

అబీమెలెకు రాజు అవటం

అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమారుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసిస్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన మామలతోను, తన తల్లి వంశస్థులందరితోను ఇలా చెప్పాడు: “షెకెము పట్టణపు నాయకులను ఈ ప్రశ్న అడగండి: ‘యెరుబ్బయలు యొక్క డెబ్బై మంది కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక ఒకే మనిషిచేత పాలింపబడుట మంచిదా? నేను మీ బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.’”

అబీమెలెకు మామలు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయకులు చెప్పారు. కనుక షెకెము నాయకులు డెభ్భై వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి బయలు బెరీతు[a] దేవతా మందిరానికి చెందినది. అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మనుష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబడించారు.

అబీమెలెకు ఒఫ్రాలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. అబీమెలెకు తన తండ్రియైన యెరుబ్బయలు (గిద్యోను) కుమారులు డెభ్భై మందిని చంపివేశాడు. అతడు వారందరినీ ఒకే సమయంలో[b] చంపివేశాడు. అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలెకునకు కనబడకుండా దాగుకొని తప్పించుకొన్నాడు. ఆ చిన్న కుమారుని పేరు యోతాము.

అప్పుడు షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమావేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము (మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమెలెకును వారి రాజుగా చేసుకున్నారు.

యోతాము కథ

షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు:

“షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును.

“ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి.

“కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’

10 “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి.

11 “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు.

12 “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి.

13 “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నది.

14 “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి.

15 “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది.

16 “అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరుబ్బయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామర్శించాల్సినట్టు, పరామర్శించియుంటే మంచిదే. 17 కానీ నా తండ్రి మీ కోసం ఏమి చేశాడో ఆలోచించండి. నా తండ్రి మీ కోసం పోరాడాడు. మిద్యాను ప్రజలనుండి అతడు మిమ్మల్ని రక్షించినప్పుడు తన ప్రాణాన్ని అపాయానికి గురిచేసుకున్నాడు. 18 కానీ ఇప్పుడు మీరు నా తండ్రి వంశానికి విరోధంగా తిరిగారు. నా తండ్రి కుమారులు డెభ్భై మందిని ఒకేసారి మీరు చంపివేసారు. అబీమెలెకును షెకెము పట్టణము మీద రాజుగా మీరు చేశారు. అతడు మీకు బంధువు గనుక మీరు అతనిని రాజుగా చేశారు. కానీ అతడు కేవలం నా తండ్రి యొక్క దాసీ కుమారుడు మాత్రమే! 19 కనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతోషంగా ఉండవచ్చు. 20 కాని మీరు సరిగ్గా ప్రవర్తించి ఉండకపోతే, షెకెము నాయకులైన మిమ్మల్ని మిల్లో ఇంటివారిని అబీమెలెకు నాశనం చేయును గాక. మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును గాక.”

21 యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారిపోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించుకొని పోయాడు. యోతాము అతని సోదరుడైన అబీమెలెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే ఉండిపోయాడు.

షెకెముతో అబీమెలెకు యుద్ధం

22 అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవత్సరాలు పాలించాడు. 23-24 అబీమెలెకు చంపిన డెభ్భై మంది యెరుబ్బయలు కుమారులు అబీమెలెకునకు స్వంత సోదరులే. ఈ చెడు కార్యాలు చేయటంలో షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీమెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించుటకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలుపెట్టారు. 25 షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. ఆ దాడుల విషయం అబీమెలెకునకు తెలిసిపోయింది.

26 ఎబెదు కుమారుడు గాలు అను పేరుగల మనిషి, అతని సోదరులు షెకెము పట్టణానికి తరలి వచ్చారు. షెకెము పట్టణానికి నాయకులు గాలును నమ్మేందుకు, వెంబడించేందుకు తీర్మానించారు.

27 ఒకరోజు ద్రాక్ష పండ్లు ఏరుకొనేందుకు షెకెము ప్రజలు పొలాలకు వెళ్లారు. ప్రజలు ద్రాక్షరసం చేసేందుకు ద్రాక్షాపండ్లను పిండారు. తరువాత వాళ్లు తమ దేవుని ఆలయంలో ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలు తిని, త్రాగి అబీమెలెకుపై చెడుగా మాటలాడుకున్నారు.

28 అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము షెకెము ప్రజలమా? మనమెందుకు అతనికి విధేయులవ్వాలి? అబీమెలెకు తనను ఏమనుకొంటున్నాడు? అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు కాడా? అబీమెలెకు జెబూలూను తన అధికారిగా నియమించలేదా? మనము అబీమెలెకునకు విధేయులం కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే హామోరు ప్రజలనే[c] అనుసరించాలి. అని వారితో అన్నాడు. (హామోరు షెకెముకు తండ్రి) 29 నీవు నన్ను ఈ ప్రజలకు ముఖ్యాధికారిగా చేస్తే, నేను అబీమెలెకును నాశనం చేస్తాను. నేను అతనికి ‘నీ సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి రా’” అని చెప్తాను.

30 జెబులు షెకెము పట్టణానికి అధిపతియై ఉండెను. ఎబెదు కుమారుడైన గాలు ఈ మాటలను మాట్లాడినప్పుడు జెబలుకు చాలా కోపం వచ్చింది. 31 అప్పుడతడు అరుమ పట్టణంలో ఉన్న అబీమెలెకు దగ్గరకు జెబులు వార్తాహరులను పంపించాడు. ఆ సందేశం యిది:

“ఎబెదు కుమారుడు గాలు, మరియు గాలు సోదరులు షెకెము పట్టణం వచ్చారు. వారు మీకు చిక్కులు కలిగిస్తున్నారు. మొత్తం పట్టణాన్ని గాలు మీకు విరోధంగా తిప్పుతున్నాడు. 32 కనుక మీరు, మీ మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట పొలాల్లో దాగుకోవాలి. 33 తరువాత సూర్యోదయం కాగానే పట్టణం మీద దాడి చేయండి. మీతో యుద్ధం చేయటానికి గాలు, అతని మనుష్యులు బయటకు వస్తారు. ఆ మనుష్యులు పోరాడేందుకు బయటకు రాగానే వారికి మీరు చేయగలిగింది చేయండి.”

34 కనుక ఆ రాత్రివేళ అబీమెలెకు, అతని సైనికులు లేచి పట్టణానికి వెళ్లారు, ఆ సైనికులు నాలుగు గుంపులుగా విడిపోయారు. వారు షెకెము పట్టణానికి దగ్గరలో దాగుకొన్నారు. 35 ఎబెదు కుమారుడు గాలు బయటకు వెళ్లి షెకెము పట్టణ ద్వార ప్రవేశం దగ్గర నిలబడ్డాడు. గాలు అక్కడ నిలబడి ఉండగా అబీమెలెకు, అతని సైనికులు వారి రహస్య స్థలాల నుండి బయటకు వచ్చారు.

36 గాలు ఆ సైనికులను చూశాడు. గాలు, “అదిగో చూడు. ఆ కొండల మీద నుండి మనుష్యులు దిగి వస్తున్నారు” అని అన్నాడు.

కాని జెబలు, “నీకు కనబడుతోంది కొండల నీడలు మాత్రమే. ఆ నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే కనబడతాయి” అన్నాడు.

37 కాని, “అదిగో చూడు అక్కడ. ఆ చోట నుండి కొందరు మనుష్యుల దండు దిగివస్తోంది. ఆ శకునగాండ్ర వృక్షం పక్కగా ఎవరిదో తల నాకు కనబడుతోంది” అని గాలు మరల చెప్పాడు. 38 నీవు ఇప్పుడు ఎందుకు అతిశయించుట లేదు? “‘అబీమెలెకు ఎవడు? మేము ఎందుకు అతనికి విధేయులము కావాలి?’ అని నీవు అడిగావు. ఈ మనుష్యులను గూర్చి నీవు హేళన చేశావు. ఇప్పుడు వెళ్లి వారితో యుద్ధం చేయి” అని జెబులు గాలుతో చెప్పాడు.

39 కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు. 40 అబీమెలెకు, అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను వెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం వైపు వెనుకకు పరుగెత్తారు. ఆ ద్వారం చేరక ముందే గాలు మనుష్యులు చాలామంది చంపివేయబడ్డారు.

41 అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం నుండి జెబులు బలవంతంగా వెళ్లగొట్టాడు.

42 మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు. 43 కనుక అబీమెలెకు తన మనుష్యులను మూడు గుంపులుగా విభజించాడు. షెకెము ప్రజలపై ఆశ్చర్య రీతిగా దాడి చేయాలని అతడు అనుకొన్నాడు. కనుక అతడు తన మనుష్యులను పొలాల్లో దాచి ఉంచాడు. ప్రజలు పట్టణంలో నుండి బయటకు రావటం అతడు చూడగానే అతడు దూకి వారిపై దాడిచేశాడు. 44 అబీమెలెకు, అతని గుంపువారు షెకెము ద్వారం దగ్గర ఒక చోటికి పరుగెత్తారు. మిగిలిన రెండు గుంపుల వారు పొలాల్లో ఉన్న ప్రజల దగ్గరకు పరుగెత్తి వారిని చంపివేశారు. 45 ఆ రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణం మీద యుద్ధం చేశారు. అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణ ప్రజలను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు ఆ పట్టణాన్ని కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు.

46 షెకెము గోపురం దగ్గర కొంతమంది ప్రజలు నివసించేవారు. షెకెమునకు సంభవించిన దాన్ని గూర్చి అక్కడి ప్రజలు విన్నప్పుడు వారు ఏల్‌బెరీతు[d] దేవతా మందిరంలో ఎంతో క్షేమంగా ఉండే గదిలో సమావేశమయ్యారు.

47 షెకెము గోపురపు నాయకులందరూ సమావేశమయ్యారని అబీమెలెకు విన్నాడు. 48 కనుక అబీమెలెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను చేసిన పని చేయండి” అని చెప్పాడు. 49 కనుక వారందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. ఏల్‌బెరీతు దేవతా మందిరపు భద్రతాగదికి అడ్డంగా కుప్ప వేసారు. అప్పుడు వారు ఆ కొమ్మలకు నిప్పు అంటించి ఆ గదిలో ఉన్న మనుష్యులను కాల్చివేసారు. కనుక షెకెము గోపురం దగ్గర నివసించే స్త్రీ పురుషులు వెయ్యిమంది చనిపోయారు.

అబీమెలెకు మరణం

50 అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు పట్టణం వెళ్లారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. 51 కాని ఆ పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. ప్రజలు ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు మీదికి ఎక్కారు. 52 ఆ గోపురం మీద దాడి చేయుటకు అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు. 53 కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది. 54 వెంటనే అబీమెలెకు తన ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయి. ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది’ అని ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను చంపివేయాలి” అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు చనిపోయాడు. 55 అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి వెళ్లారు.

56 ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు విషయాలు అన్నింటికోసం దేవుడు అతణ్ణి శిక్షించాడు. అబీమెలెకు తన డెభ్భై మంది సోదరులను చంపి తన స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు. 57 షెకెము పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా గిద్యోను).

న్యాయముర్తి తోలా

10 అబీమెలెకు చనిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు దేవుడు మరో న్యాయమూర్తిని పంపించాడు. ఆ మనిషి పేరు తోలా. తోలా, పువ్వా అనే పేరుగల మనిషి కుమారుడు. పువ్వా, దోదో అనే పేరుగల వాని కుమారుడు. తోలా ఇశ్శాఖారు వంశానికి చెందినవాడు. తోలా షామీరు పట్టణంలో నివసించేవాడు. షామీరు పట్టణం ఎఫ్రాయిము కొండ దేశంలో ఉంది. తోలా ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. తర్వాత తోలా చనిపోయి, షామీరు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

న్యాయమూర్తి యాయీరు

తోలా మరణించిన తరువాత మరో న్యాయమూర్తి దేవుని చేత పంపబడ్డాడు. ఆ మనిషి పేరు యాయీరు. యాయీరు గిలాదు ప్రాంతంలో నివసించేవాడు. యాయీరు ఇరవైరెండు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. యాయీరుకు ముప్పయి మంది కుమారులు. ఆ ముప్పయి మంది కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధికారం చేసేవారు. ఈ రోజు వరకు ఆ పట్టణాలు యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి. యాయీరు మరణించి కామోను పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

అమ్మోనీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయుట

మరల ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చెడ్డవి అని చెప్పిన వాటినే చేసారు. బూటకపు దేవతలు బయలు, అష్టారోతులను వారు పూజించటం మొదలు పెట్టారు. వారు అరాము ప్రజల దేవుళ్లను, సీదోను ప్రజల దేవుళ్లను, మోయాబు ప్రజల దేవుళ్లను, అమ్మోను ప్రజల దేవుళ్లను, ఫిలిష్తీయ ప్రజల దేవుళ్లను కూడా పూజించారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఆయనను సేవించటం మానుకున్నారు.

కనుక ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు కోపం వచ్చింది. ఫిలిష్తీ ప్రజలు, అమ్మోను ప్రజలు వారిని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. అదే సంవత్సరం యోర్దాను నదికి తూర్పు వైపునగల గిలాదు ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు ప్రజలను ఆ మనుష్యులు నాశనం చేసారు. అది అమ్మోరీ ప్రజలు నివసించిన దేశం. ఆ ఇశ్రాయేలు ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు శ్రమ అనుభవించారు. అప్పుడు అమ్మోనీయులు యోర్దాను నది దాటి వెళ్లారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము ప్రజల మీద యుద్ధం చేసేందుకు వారు వెళ్లారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలకు అనేక కష్టాలు కలిగించారు.

10 కనుక ఇశ్రాయేలు ప్రజలు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. “దేవా, మేము నీకు విరోధంగా పాపం చేశాము. మేము మా దేవుని విడిచిపెట్టి బూటకపు బయలు దేవతను పూజించాము” అని వారు చెప్పారు.

11 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా జవాబు చెప్పాడు: “ఈజిప్టు ప్రజలు అమ్మోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. వారి బారినుండి నేను మిమ్మల్ని రక్షించాను. 12 సీదోను ప్రజలు, అమాలేకీయులు, మిద్యానీయులు[e] మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. ఆ ప్రజల నుండి కూడా నేను మిమ్మల్ని రక్షించాను. 13 కానీ మీరు నన్ను విడిచిపెట్టేశారు. మీరు ఇతర దేవుళ్లను పూజించారు. కనుక మిమ్మల్ని మరల రక్షించటానికి నేను నిరాకరిస్తున్నాను. 14 ఆ దేవుళ్లను పూజించటం మీకు ఇష్టం కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్లనే మీకు సహాయం చేయనీయండి.”

15 కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలనుకొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని రక్షించు” అని యెహోవాను అడిగారు. 16 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యదేవతలను పారవేశారు. వారు మరల యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టారు. కనుక వారు శ్రమపడుతున్నప్పుడు యెహోవా వారిని చూచి సంతాపపడ్డాడు.

నాయకునిగా యెఫ్తా ఎన్నుకోబడుట

17 అమ్మోనీయులు యుద్ధానికి సమావేశమయ్యారు. గిలాదు ప్రాంతంలో వారు విడిది చేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కచోట సమావేశమయ్యారు. మిస్పా పట్టణం వద్ద ఉంది వారి విడిది. 18 గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజల నాయకులు, “అమ్మోను ప్రజలమీద దాడి చేసేందుకు మనల్ని ఎవరు నడిపిస్తారు? ఆ మనిషి, గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ ప్రధాని అవుతాడు” అన్నారు.

లూకా 5:17-39

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మత్తయి 9:1-8; మార్కు 2:1-12)

17 ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు,[a] శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. 18 కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. 19 కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. 20 ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు.

21 పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు.

22 వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? 23 ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? 24 కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

25 ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. 26 అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.

లేవి (మత్తయి) యేసును వెంబడించటం

(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)

27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి[b] అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. 28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.

29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. 30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.

31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. 32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)

33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.

34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? 35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు. 37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. 38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. 39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International