Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 27-28

అర్పణలు దహించడానికి బలిపీఠం

27 “తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి. బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్ము చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి.

“బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి. ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి. బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది.

“బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి. బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి. బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.

గుడారానికి ఆవరణను ఏర్పరచటం

(“పవిత్ర గుడారం చుట్టూ తెరలతో కట్టు. ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరలు గోడగా ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి. 10 ఇరవై స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డీలు వెండితో చేయాలి. 11 దక్షిణ వైపున ఉన్నంత పొడవే ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి.

12 “ఆవరణం పడమటికొనవైపు 25 గజాల పొడవుగల తెరలతో ఒక గోడగా ఉండాలి. ఆ గోడ మీద 10 స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి. 13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి. 14 (ఈ తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) ప్రవేశ ద్వారానికి అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి. 15 అవతల వైపున కూడా ఏడున్నర గజాల పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.

16 “ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. ఆ తెరమీద చిత్ర పటాల అల్లిక ఉండాలి. నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి. 17 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు యిత్తడితోను చేయాలి. 18 ఆవరణ 50 గజాల పొడవు 25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సున్నితమైన బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి. 19 అన్ని పరికరాలు, పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయోగించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో చేయాలి.

దీపాలకు నూనె

20 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం వెలిగించాల్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు. 21 దీపం విషయం అహరోను, అతని కుమారులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్టె ఉండే గది బయట (రెండు గదులను వేరు పరచే) తెర ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్లవారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలుగుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు విధేయులు కావాలి.

యాజకుల వస్త్రాలు

28 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.

“నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి. ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు. ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు. బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టలను ఉపయోగించాలని ఆ మనుష్యులకు చెప్పు.

ఏఫోదు—నడికట్టు పట్టి

“ఏఫోదు తయారు చేయటానికి బంగారు దారాలు, సన్నని పేనిన నార బట్ట సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపయోగించాలి. నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు. ఏఫోదు[a] భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్ట వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం బట్టలకు కట్టబడతాయి.

“ఏఫోదు మీద వేసుకొనే కండువాను వారు చాల జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడుతుంది.

“నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రాయేలు పండ్రెండు మంది కుమారుల పేర్లు ఈ రత్నాల మీద చెక్కాలి 10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, మరో రత్నం మీద ఆరు పేర్లు రాయాలి. పెద్ద కుమారుడు మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో పేర్లు చెక్కు. 11 ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు. 12 అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్ట మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడ్డ రెండు రాళ్లు ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది. 13 ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి బంగారం ఉపయోగించు. 14 స్వచ్ఛమైన బంగారు గొలుసులను కలిపి తాడు పేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు అల్లికలకు బిగించు.

న్యాయతీర్పు పథకం

15 “ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి. 16 ఈ న్యాయతీర్పు పైవస్త్రం 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది ఒక సంచి అయ్యేటట్టుగా మడత చేయబడాలి. 17 న్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు వరుసలు పెట్టాలి. ఈ రత్నాల మొదటి వరసలో పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి. 18 రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి. 19 మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి. 20 నాలుగో వరుసలో రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం ఉండాలి. న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రత్నాలన్నీ నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి. 21 ఇశ్రాయేలు కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ తీర్పు పైవస్త్రం మీద పన్నెండు రత్నాలు ఉంటాయి. ఈ రాళ్లలో ఒక్కొదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు.

22 “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా ఉంటాయి. 23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు. 24 న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి. 25 ఆ గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర రెండు భుజం బట్టలమీద పెట్టు. 26 ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, న్యాయతీర్పు పైవస్త్రం, అవతల ఉన్న మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న న్యాయతీర్పు పైవస్త్రం లోపలి వైపు ఇది. 27 ఇంకా రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి ఏఫోదు దట్టీ పైభాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి. 28 న్యాయతీర్పు పైవస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు జత చేయాలి. నడికట్లతో వీటిని జత చేసేందుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల న్యాయతీర్పు పైవస్త్రం నడికట్టును పట్టుకొని ఉంటుంది.

29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు. 30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.

యాజకుల యితర వస్త్రాలు

31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. 32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి. 33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి. 34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి. 35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.

36-37 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి. 38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.

39 “అంగీని తయారు చేసేందుకు సున్నితమైన నార బట్టను ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్నితమైన నారబట్టను ఉపయోగించాలి. నడికట్టు మీద బుట్టా కుట్టాలి. 40 చొక్కాలు, పట్టాలు, తలపాగాలు కూడా తయారు చేయాలి. ఇవి వారికి గౌరవమర్యాదలు కలిగిస్తాయి. 41 నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత వారు యాజకులని చూపెట్టేందుకుగాను వారి తలమీద ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తున్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు వారు నన్ను యాజకులుగా సేవిస్తారు.

42 “వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేందుకు శ్రేష్ఠమైన బట్టను ఉపయోగించాలి. లోపల ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి. 43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి.

మత్తయి 21:1-22

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-19)

21 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”

దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:

“‘గాడిదనెక్కి వినయంగా
    నీ రాజు వస్తున్నాడు చూడు!
బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’
    అని సీయోను కుమారితో చెప్పండి.”(A)

శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు.

“దావీదు కుమారునికి హోసన్నా!
    ‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’(B)

మహోన్నతమైన స్థలములో హోసన్నా!”

10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.

11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)

12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(C) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.

14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. 15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.

16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు.

యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’(D) అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.

17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మార్కు 11:12-14, 20-24)

18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.

20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.

21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International