Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 4-5

అకస్మాత్తు పాపాలకు బలులు

మోషేతో యెహోవా మాట్లాడి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ప్రమాదవశాత్తు ఎవరైనా పాపం చేసి, చేయకూడదని యెహోవా చెప్పిన వాటిని చేస్తే, అప్పుడు అతడు ఇలా చేయాలి:

“అభిషేకించబడిన యాజకుడు[a] పాపం చేసి, ప్రజలమీదికి దోషం రప్పిస్తే, అప్పుడు అతడు తాను చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను అర్పించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను అతడు అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను అతడు అర్పించాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటకు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. అతడు కోడెదూడ తల మీద తన చేతులు ఉంచి, యెహోవా ఎదుట దానిని వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు అప్పుడు ఆ దూడ రక్తాన్ని కొంత తీసుకొని, దానిని సన్నిధిగుడారం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, పవిత్రగది తెర ముందు యెహోవా ఎదుట ఏడు సార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. యాజకుడు సుగంధద్రవ్వాల ధూప వేదిక మీద ఆ రక్తంలో కొంత పూయాలి, (ఈ ధూపవేదిక సన్నిధిగుడారంలో యెహోవా ఎదుట ఉంటుంది). ఆ కోడెదూడ రక్తాన్ని అంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉంటుంది. మరియు అతడు పాప పరిహారార్థపు కోడెదూడ కొవ్వునంతా తీసివేయాలి. లోపలి భాగాలమీద, చుట్టూ ఉండే కొవ్వు అంతా అతడు తీసివేయాలి. రెండుమూత్ర పిండాలను, వాటిమీది కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు తీసుకోవాలి. కార్జాన్ని కప్పి ఉన్న కొవ్వును అతడు తీసుకోవాలి. మరియు అతడు మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా తీసుకోవాలి. 10 సమాధాన బలిలో బలియివ్వబడే కోడెదూడనుండి తీసినట్టే అతడు వీటన్నింటినీ తీయాలి.[b] యాజకుడు దహన బలి పీఠంమీద దాని భాగాలన్నింటినీ కాల్చాలి. 11 కాని, ఆ కోడెదూడ చర్మాన్ని, దాని మాంసం అంతటినీ, దాని తల, కాళ్లు, లోపలి భాగాలను, దాని పేడను యాజకుడు బయటకు తీసుకొనిపోవాలి. 12 బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన చోటుకు ఆ కోడెదూడ కళేబరాన్ని యాజకుడు తీసుకుపోవాలి. అక్కడ కట్టెల మీద నిప్పుతో ఆ కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద పారబోసే చోట ఆ కోడెదూడ కాల్చివేయబడుతుంది.

13 “ఒక వేళ ఇశ్రాయేలు జనులంతా తెలియకుండా పాపం చేయటం తటస్థించవచ్చు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా వారు చేసినట్లయితే వారు అపరాధులు అవుతారు. 14 ఆ పాపం విషయమై వారు తెలుసుకొంటే, అప్పుడు ఆ జనాంగం అంతటి నిమిత్తం పాప పరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించాలి. సన్నిధి గుడారం ఎదుటికి వారు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. 15 సమాజపు పెద్దలందరూ, యెహోవా ఎదుట ఆ కోడెదూడ మీద వారి చేతులు ఉంచాలి. యెహోవా ఎదుట ఆ కోడెదూడ వధించబడాలి. 16 అప్పుడు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంత సన్నిధి గుడారం దగ్గరకు తీసుకొనిరావాలి. 17 యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, తెరముందు యెహోవా ఎదుట ఏడు సార్లు దాన్ని చిలకరించాలి. 18 అప్పుడు యాజకుడు బలిపీఠం కొమ్ములకు కొంత రక్తం పూయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట ఉంది. రక్తాన్నంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడార ద్వారం దగ్గర ఉంది. 19 అప్పుడు యాజకుడు దాని కొవ్వు అంతా తీసి బలిపీఠంమీద దహించాలి. 20 పాప పరిహారార్థ బలిపశువుకు చేసినట్టే అతడు ఈ కోడెదూడకు కూడా చేయాలి[c] ఈ విధంగా యాజకుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్షమిస్తాడు. 21 యాజకుడు ఆ కోడెదూడను బస బయటకు తీసుకొని వెళ్లి దానిని కాల్చివేయాలి. ఇదీ మొదటి కోడెదూడకు చేసినట్టే. ఇది మొత్తం సమాజానికి పాప పరిహారార్థ బలి.

22 “చేయకూడదని యెహోవా చెప్పిన ఆజ్ఞలలో దేనినైనా ఒక అధికారి పొరబాటున అతిక్రమన చేసినట్లయితే, అప్పడు ఆ అధికారి అపరాధి అవుతాడు. 23 అతడు తన పాపం విషయమై తెలుసుకొంటే, అతడు ఏ దోషమూ లేని ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ. 24 ఆ అధికారి ఆ మేక మీద తన చేయి ఉంచి, యెహోవా ఎదుట వారు దహనబలి పశువును వధించు చోట దానిని వధించాలి. ఆ మేక పాపపరిహారార్థ బలి. 25 యాజకుడు పాప పరిహారార్థబలిలో కొంత రక్తాన్ని తన వేలితో తీసుకోవాలి. యాజకుడు ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని యాజకుడు దహన బలిపీఠం అడుగున పోయాలి. 26 ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితంచేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు.

27 “చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు. 28 అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి. 29 అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి. 30 అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెం తన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. 31 తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.

32 “ఈ వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ గొర్రెయై ఉండాలి. 33 అతడు దాని తలమీద తన చేయి ఉంచి, దహనబలి పశువును వధించే స్థలంలో, పాపపరిహారార్థ బలిగా దానిని కూడా వధించాలి. 34 ఆ పాప పరిహారార్థ బలి రక్తాన్ని యాజకుడు తనవేలితో తీసుకొని, దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. తర్వాత ఆ గొర్రె రక్తాన్నంతా బలిపీఠం అడుగున అతడు పోయాలి. 35 సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.

విభిన్న అకస్మాత్తు పాపాలు

“ఒక వ్యక్తి హెచ్చరికను వినవచ్చు, లేక ఒక వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విషయాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే అతడు అపరాధి.

“లేక ఒకవేళ ఏదైనా అపవిత్రమైన దాన్ని ఒక వ్యక్తి తాకవచ్చును. అది అపవిత్ర జంతువు శవం గాని, లేక అపవిత్ర పశు శవంగాని, లేక అపవిత్రమైన ఒక పాకెడు జంతువు శవమేగాని కావచ్చును. వాటిని ముట్టుకొన్నట్టు అతనికి తెలియకపోయినా అతడు మాత్రం అపరాధి అవుతాడు.

“ఒక మనిషి నుండి అపవిత్రం అయినవి ఎన్నోవస్తాయి. ఒక వ్యక్తి అవతల వ్యక్తిలోని యిలాంటి అపవిత్రమైన వాటిలో దేనినైనా ముట్టుకోవచ్చు, అది అతనికి తెలియకపోవచ్చు. అపవిత్రమైనది ఏదో తాను ముట్టుకొన్నానని అతనికి తెలిసినప్పుడు అతడు అపరాధి అవుతాడు.

“లేక ఒక వ్యక్తి మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానంచేసి, దానిని మరిచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి అవుతాడు. కనుక వీటిలో దేని విషయంలో అతడు అపరాధియైనా, అతడు చేసిన తప్పు ఏమిటో అతడు చెప్పాలి. అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ పరిహారార్థబలిని యెహోవాకు అర్పించాలి. గొర్రెల మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థబలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజకుడు చేస్తాడు.

“ఆ వ్యక్తి గొర్రెపిల్లను ఇవ్వలేకపోతే అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను గాని తీసుకొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థబలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన బలికోసం. ఆ వ్యక్తి వాటిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. పాపపరిహారార్థ బలిగా మొదట ఒక దాన్ని యాజకుడు అర్పిస్తాడు. యాజకుడు దాని తలను మెడనుండి వేరు చేస్తాడు. కానీ ఆ పక్షిని రెండు భాగాలుగా మాత్రం యాజకుడు విడదీయడు. పాపపరిహారార్థబలి రక్తాన్ని బలిపీఠం ప్రక్కలో యాజకుడు చిలకరించాలి. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. అది పాపపరిహారార్థ బలి. 10 తర్వాత యాజకుడు చట్టం ప్రకారం దహన బలిగా రెండో పక్షిని అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.

11 “ఆ వ్యక్తికి రెండు పావురాలను, రెండు గువ్వలను యిచ్చే సామర్థ్యం లేకపోతే తూమెడు మంచి పిండిలో పదోవంతును అతడు తీసుకొని రావాలి. ఇది అతని పాపపరిహారార్థ బలి అర్పణ. ఆ పిండిమీద అతడు నూనె పోయకూడదు. అది పాపపరిహారార్థ బలి గనుక అతడు దానిమీద సాంబ్రాణి కూడా వేయకూడదు. 12 అతడు ఆ పిండిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పిండిలోనుండి యాజకుడు పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజకుడు ఆ పిండిని దహించాలి. అది పాపపరిహారార్థ బలి. 13 ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ధాన్యార్పణలో వలెనే పాపపరిహారార్థ బలిలో మిగిలినది కూడా యాజకునికి చెందుతుంది.”

14 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 15 “యెహోవా పవిత్ర విషయాలకు వ్యతిరేకంగా ఒకడు పొరబాటున ఏదైనా తప్పు చేయవచ్చును. అప్పుడు అతడు ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలో నుండి తీసుకొని రావాలి. ఇది యెహోవాకు అతని అపరాధ పరిహారార్థ బలి అర్పణ. పవిత్ర స్థానపు అధికారిక కొలత ప్రకారం ఆ పొట్టేలుకు నీవు ధర నిర్ణయించాలి. 16 పవిత్ర విషయానికి విరుద్ధంగా అతడు చేసిన పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ధరకు అయిదో వంతు అతడు కలపాలి. ఈ మొత్తాన్ని అతడు యాజకునికి ఇవ్వాలి. ఈ విధంగా అపరాధ పరిహారార్థ బలి పోట్టేలుతో ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.

17 “ఒకడు పాపం చేసి, చేయగూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసినప్పుడు అది అతనికి తెలియకపోయినా ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు తన పాపానికి బాధ్యత వహించాలి. 18 ఆ వ్యక్తి ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలోనుండి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పొట్టేలు అపరాధ పరిహారార్థబలి అర్పణ. ఆ వ్యక్తి తెలియక చేసిన పాపాన్ని ఈ విధంగా యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. 19 ఆ వ్యక్తి చేస్తున్నది పాపం అని అతనికి తెలియకపోయినా అతడు అపరాధి అవుతాడు. కనుక అపరాధ పరిహారార్థ బలిని అతడు యెహోవాకు అర్పించాలి.”

మత్తయి 24:29-51

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

ఆ దినం కాని, ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు

(మార్కు 13:32-37; లూకా 17:26-30, 34-36)

36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.

37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు.

“మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు. 40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.

42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. 43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు. 44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International