Old/New Testament
దేవుని పట్ల విధేయులకు బహుమానాలు
26 “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.
2 “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
3 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి. 4 వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. 5 ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది. మీరు మళ్ళీ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 6 నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.
7 “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. 8 మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.
9 “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. 10 ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. 11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. 12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. 13 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
అవిధేయతకు దేవుని శిక్ష
14 “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి. 15 నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే. 16 మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు. 17 నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.
18 “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను. 19 మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశం వర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు. 20 మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.
21 “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు. 22 నేను మీ మీదికి అడవి మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొనిపోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు భయపడతారు.
23 “అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే, 24 అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను. 25 మీరు నా ఒడంబడికను ఉల్లంఘించారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైన్యాలను నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ పట్టణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు మిమ్మల్ని ఓడించేస్తాడు. 26 ఆ పట్టణంలో మిగిలిపోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు.
27 “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే 28 అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను. 29 మీ కుమారులు, కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు. 30 మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు. 31 మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను. 32 మీ పట్టణాల్లో నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను. 33 ఇంకా నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొట్టేస్తాను. నేను నా ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి.
34 “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది. 35 ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది. 36 శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు. 37 ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు.
“మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు. 38 ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు. 39 కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోతారు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోతారు.
నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది
40 “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు. 41 ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే 42 అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
43 “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు. 44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి. 45 వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”
46 అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.
వాగ్దానాలు ముఖ్యం
27 యెహోవా మోషేతో చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు ఆ విలువ చెల్లించాలి. 3 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసుగల ఒక మగవాడి విలువ యాభై తులాల వెండి. (వెండిని తూచేందుకు పవిత్ర స్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి). 4 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు. 5 ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక మగవాని విలువ ఇరవైతులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ పది తులాలు. 6 ఒక నెలనుండి ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక మగ శిశువు వెల ఐదు తులాలు. ఆడ శిశువు వెల మూడు తులాలు. 7 అరవై సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న ఒక మగవాని వెల పదిహేను తులాలు. ఒక స్త్రీ వెల పది తులాలు.
8 “ఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడైతే ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.
యెహోవాకు కానుకలు
9 “కొన్ని జంతువులు యెహోవాకు బలిగా ఉపయోగపడతాయి. అలాంటి ఒక జంతువును ఒక వ్యక్తి తీసుకొని వస్తే, ఆ జంతువు పవిత్రం అవుతుంది. 10 ఆ వ్యక్తి ఆ జంతువునే యెహోవాకు ఇస్తానని వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించకూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత అవి రెండూ యెహోవాకే చెందుతాయి.
11 “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యెహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి. 12 యాజకుడు ఆ జంతువుకు విలువ నిర్ణయం చేస్తాడు. యాజకుడు వెల నిర్ణయం చేసిన తర్వాత ఆ జంతువు మంచిదేగాని పనికిరానిదేగాని, దాని వెల అంతే. 13 ఒక వేళ ఆ వ్యక్తి తిరిగి జంతువును కొనుక్కోవాలనుకొంటే, అతడు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించాలి.
యెహోవాకు అర్పించిన ఇంటి విలువ
14 “ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు పవిత్రంగా ప్రతిష్ఠ చేస్తే, యాజకుడు దాని వెల నిర్ణయం చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే. 15 అయితే ఆ ఇంటిని ఇచ్చిన వ్యక్తి తిరిగి దానిని తీసుకొనగోరితే, దాని విలువకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ ఇల్లు ఆ వ్యక్తికి చెందుతుంది.
భూమి విలువ
16 “ఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వెల ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల వెల ఏబై తులాల వెండితో సమానము 17 ఒకవేళ బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ వ్యక్తి తన పొలాన్ని కానుకగా యిస్తే, యాజకుడు నిర్ణయించేదేదాని వెల అవుతుంది. 18 కానీ ఆ వ్యక్తి బూరధ్వని మహోత్సన కాలం దాటిపోయాక తన పొలాన్ని కానుకగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు లెక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకట్టాలి. 19 ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు అయిదో వంతు అతడు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది. 20 ఆ వ్యక్తి ఆ పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు. 21 ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పొలాన్ని మళ్లీ కొనకపొతే, బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి యెహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా ఉంటుంది.
22 “ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, అది అతని స్వంత పొలంలో ఒక భాగం కానప్పుడు. 23 యాజకుడు బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకుగల సంవత్సరాలను లెక్కించి, దాని ప్రకారం ఆ పొలం వెల నిర్ణయించాలి. అప్పుడు ఆ భూమి యెహోవాదే అవుతుంది. 24 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి దాని స్వంతదారునిది అవుతుంది. ఆ భూమి ఏ కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.
25 “ఆ ధరలు చెల్లించేందుకు పవిత్రస్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి. పవిత్ర స్థలంలో అధికారతులం బరువు 20 చిన్నాలు.
జంతువుల విలువ
26 “పశువుల్ని, గొర్రెల్ని, ప్రజలు యెహోవాకు కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలిచూలు అయితే అది ముందే యెహోవాది. కనుక తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు. 27 తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు ఆ జంతువును అమ్మివేయాలి.
ప్రత్యేక కానుకలు
28 “ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యెహోవాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు ఆ కానుక కావచ్చును. 29 ఒకవేళ ఆ ప్రత్యేకమైన కానుక ఒక వ్యక్తి అయివుంటే ఆ వ్యక్తిని తిరిగి కొనేందుకు వీల్లేదు. ఆ వ్యక్తి చంపబడవలసినదే.
30 “పంటలన్నింటిలో పదోవంతు యెహోవాకు చెందుతుంది. అంటే పొలాల్లోని పంటలు, చెట్ల ఫలాలు అని అర్ధం. ఆ పదోవంతు యెహోవదే అవుతుంది. 31 కనుక ఎవరైనా తన పదోవంతు తిరిగి తీసుకోవాలి అనుకొంటే, వారు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించి, అప్పుడు దానిని తిరిగి కొనుక్కోవాలి.
32 “ఒక వ్యక్తికిగల పశువులు, గొర్రెలలో నుండి ప్రతి పదో జంతువును యాజకులు తీసుకోవాలి. పదోజంతువు ప్రతీదీ యెహోవాదే అవుతుంది. 33 కోరుకొన్న ఆ జంతువు మంచిదైనా చెడ్డదైనా, దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చకూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని అతడు నిర్ణయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతువులూ యెహోవావే అవుతాయి. ఆ జంతువును తిరిగికొనేందుకు వీల్లేదు.”
34 సీనాయి పర్వతం దగ్గర మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి. అవి ఇశ్రాయేలు ప్రజలకోసమైన ఆజ్ఞలు.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మత్తయి 9:1-8; లూకా 5:17-26)
2 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
లేవి (మత్తయి) యేసును వెంబడించటం
(మత్తయి 9:9-13; లూకా 5:27-32)
13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి[a] పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.
15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. 16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.
17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మత్తయి 9:14-17; లూకా 5:33-39)
18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మత్తయి 12:1-8; లూకా 6:1-5)
23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.
27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”
© 1997 Bible League International