Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 12-14

మిర్యాము, అహరోను మోషేను విమర్శించటం

12 మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు.

యెహోవా ఇది విన్నాడు. (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు.

కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”

అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది. 10 యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది.

11 అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా, బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు. 12 చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడి పుడుతుంది.)

13 కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు.

14 “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు.

15 కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు. 16 అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యానికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొన్నారు.

గూఢచారులు కనాను వెళ్లటం

13 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”

కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు. వారి పేర్లు ఇవి:

రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.

షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.

యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.

ఇశ్శాఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.

ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.

బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.

10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.

11 మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.

12 దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.

13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.

14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.

15 గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.

16 ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)

17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి. 18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా? 19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా? 20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).

21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు. 22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు. 23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. 24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు[a] అని పిలువబడింది.

25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. 26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. 27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో. 28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము. 29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యొర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”

30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.

31 కానీ అతనితోకూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు. 32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనిపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”

మళ్లీ ప్రజల ఫిర్యాదు

14 ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే, అహరోనులతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యంలోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత చావటంకంటె అదే బాగుండేది. మమ్మల్ని ఈ కొత్త దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి పోవటమే మాకు క్షేమం.”

అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.

అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరి ముందు మోషే, అహరోను సాష్టాంగపడ్డారు. ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను కుమారుడైన యెహోషువ యెపున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకున్నారు. ఈ ఇద్దరు మనుష్యులూ అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాలబాగుంది. మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు. అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”

10 అప్పుడు అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలంతా వీళ్లిద్దర్నీ రాళ్లతో కొట్టి చంపేయాలని మాట్లాడుకొన్నారు. అయితే యెహోవా మహిమ సన్నిధి గుడారం మీదికి దిగివచ్చింది. ఇశ్రాయేలు ప్రజలంతా అది చూడగలిగారు. 11 అప్పుడు మోషేతో, యెహోవా: “ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రజలు ఇలా చేస్తారు? వాళ్లు నన్ను నమ్మటంలేదనే వ్యక్తం చేస్తున్నారు. నా శక్తి మీద వాళ్లకు నమ్మకంలేనట్టే కనబడుతోంది. శక్తివంతమైన ఎన్నో సూచనలు నేను వాళ్లకు చూపించిన తర్వాతకూడ వాళ్లు నన్ను నమ్మటానికి నిరాకరిస్తున్నారు. వాళ్లమధ్య నేను ఎన్నో మహాకార్యాలు చేసాను. 12 ఒక భయంకర రోగంతో వాళ్లందరినీ నేను చంపేస్తాను. వాళ్లను నేను నాశనం చేస్తాను. మరో జనాంగాన్ని తయారు చేసేందుకు నిన్ను నేను వాడు కొంటాను. ఆ జనాంగం ఈ ప్రజలకంటె గొప్పదిగా, బలమైనదిగా ఉంటుంది.” అని అన్నాడు.

13 అప్పుడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని ఈజిప్టు ప్రజలు వింటారు. ఈ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ గొప్ప శక్తిని ప్రయోగించావు. 14 ఈ గొప్ప శక్తినిగూర్చి ఈ దేశ నివాసులందరికీ ఈజిప్టు ప్రజలు చెప్పారు. యెహోవా, వాళ్లు ఇప్పటికే నిన్నుగూర్చి విన్నారు. నీవు నీ ప్రజలకు తోడుగా ఉన్నావనీ ప్రతి ఒక్కరూ నిన్ను చూసారనీ వారికి తెలుసు. నీ ప్రజలమీద నిలిచే మేఘాన్ని గూర్చి కూడ ఈ దేశవాసులకు తెలుస్తుంది. పగలు నీ ప్రజలను నడిపించేందుకు నీవు ఆ మేఘాన్ని వాడుకొన్నావు. రాత్రిపూట నీ ప్రజలకు నడిపించటానికి తిరిగి ఆ మేఘం అగ్నిగా మారుతుంది. 15 అందుచేత ఇప్పుడు నీవు ఈ ప్రజలను చంపకూడదు. ఒకవేళ నీవు వారిని చంపితే, నీ శక్తిని గూర్చి విన్న దేశాలన్నీ ఏమంటాయంటే 16 ‘యెహోవా ఈ ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేకపోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపేసాడు అంటారు.’

17 “కనుక యెహోవా, ఇప్పుడు నీ బలం చూపెట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు చూపించాలి. 18 ‘యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని, దోషాన్ని తీసివేస్తాడు. అయితే నేరస్థులను యెహోవా ఎప్పుడూ శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యెహోవా పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు’ అని నీవు చెప్పావు. 19 కనుక నీ మహా ప్రేమను ఈ ప్రజలకు చూపించు. వారి పాపం క్షమించు. వారు ఈజిప్టు విడిచినప్పటినుండి నీవు వారిని క్షమించినట్టే ఇప్పుడు కూడా క్షమించు.”

20 యెహోవా ఇలా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను. 21 అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను. 22 ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు. 23 వారి పూర్వీకులకు ఆ గొప్ప దేశాన్ని ఇస్తానని నేను వాగ్ధానం చేసాను. అయితే నాకు ఇలాంటి కీడు చేసిన ఏ వ్యక్తి ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు. 24 కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకెళ్తాను. అతని మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది. 25 అమాలేకీ, కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి వెళ్లండి.”

ప్రజలను యెహోవా శిక్షించాడు

26 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: 27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను. 28 కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే, 29 ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు. కనుక మీలో ప్రతి ఒక్కరు అరణ్యంలోనే చస్తారు. 30 మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశిస్తారు. 31 మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకొని వెళ్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు. 32 మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.

33 “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి పోతాయి. 34 మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.”

35 “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.”

36 ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపించిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఆ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు. 37 ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా. 38 అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు.

కనానులో ప్రవేశించటానికి ప్రజలు ప్రయత్నించటం

39 ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు. 40 మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యెహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నారు.

41 కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు. 42 మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు. 43 అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.”

44 కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు. 45 అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.

మార్కు 5:21-43

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; లూకా 8:40-56)

21 యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు. 22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి, 23 “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.

24 యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.

25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది. 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.

27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది. 28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది. 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది. 30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.

31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.

32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. 33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.

35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.

36 యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.

37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. 38 యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు. 39 ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. 40 కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు. 41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.) 42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International