Old/New Testament
దేహస్రావ నియమాలు
15 మోషే, అహరోనులతో యెహోవా యింకా యిలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు మీరిలా చెప్పండి: ఎవని దేహంలోనైనా స్రావం ఉంటే, వాడు అపవిత్రుడు. 3 వాని శరీరంలోనుండి స్రావం కారుతున్నా లేక నిలిచిపోయినా సరే ఫర్వాలేదు.
4 “స్రావం ఉన్న వ్యక్తి పరుపుమీద పండుకొంటే, ఆ పరుపు అపవిత్రం. ఆ వ్యక్తి కూర్చునేవన్నీ అపవిత్రం అవుతాయి. 5 ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి పరుపును తాకితే అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానంచేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 6 ఇంకా స్రావంగల వాడు కూర్చున్న దేనిమీదనైనా సరే కూర్చున్న ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 7 అలానే స్రావంఉన్న వ్యక్తిని తాకిన ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 8 స్రావంగల వాడు ఒక పవిత్రునిమీద ఉమ్మివేస్తే, ఈ పవిత్రుడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. ఈ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడుగా ఉంటాడు. 9 స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది. 10 కనుక స్రావంగలవాని కింద ఉన్న దేనినైనా తాకిన ప్రతి ఒక్కరూ సాయంత్రంవరకు అపవిత్రంగా వుంటారు. స్రావంగల వాని కింద ఉండే వస్తువులను మోసిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 11 ఒకవేళ స్రావంగల వ్యక్తి నీళ్లతో తన చేతులు కడుగుకోకుండా మరొక వ్యక్తిని తాకవచ్చును. అప్పుడు అవతల వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
12 “అయితే స్రావంగల వ్యక్తి ఒక మట్టి పాత్రను తాకితే ఆ పాత్రను పగులగొట్టివేయాలి. స్రావంగల ఈ వ్యక్తి గనుక ఒక చెక్క పాత్రను తాకితే, ఆ పాత్రను నీళ్లతో కడగాలి.
13 “స్రావంగల వాడు తన స్రావం నుండి పవిత్రునిగా చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు లెక్కబెట్టుకోవాలి. అప్పుడు అతడు పారుతున్న నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. అతడు పవిత్రుడు అవుతాడు. 14 ఎనిమిదో రోజున రెండు గువ్వలను గాని రెండు పావురపు పిల్లలనుగాని ఆ వ్యక్తి తనకోసం తీసుకొని వెళ్లాలి. సన్నిధి గుడారద్వారం దగ్గర యెహోవా ఎదుటికి అతడు రావాలి. ఆ వ్యక్తి రెండు పక్షులను యాజకునికి యివ్వాలి. 15 ఒక పక్షిని పాపపరిహారార్థ బలిగాను, మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. కనుక యాజకుడు ఆ వ్యక్తిని యెహోవాకు పవిత్రునిగా చేస్తాడు.
16 “ఒకనికి వీర్యస్ఖలనం అవుతోంటే అతడు నీళ్లలో పూర్తిగా స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు. 17 ఒకవేళ ఏ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, ఆ బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది. 18 ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీతో శయనించగా వీర్యస్ఖలనమైనప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
19 “ఒక స్త్రీకి తన నెలసరి రక్తస్రావంనుండి స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు ఆ రోజు సాయంత్రంవరకు అపవిత్రంగా ఉంటారు. 20 మరియు ఆ స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. ఆ సమయంలో ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి. 21 ఎవరైనా ఆ స్త్రీ పడకను తాకినట్టుయితే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడు. 22 ఒకవేళ ఎవరైనా ఆమె కూర్చున్న దేనినైనా తాకితే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రం. 23 ఒకవ్యక్తి ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినైనా తాకినా, ఆ వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
24 “మరియు ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక పురుషుడు ఆమెతో లైంగిక పొందు అనుభవిస్తే, ఆ పురుషుడు ఏడురోజులపాటు అపవిత్రంగా ఉంటాడు. ఆ పురుషుడు పండుకొనే ప్రతి పడకా అపవిత్రం అవుతుంది.
25 “ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావ సమయంలో గాక, ఆ తర్వాత ఆమెకు రక్తం చాల రోజుల వరకు స్రవిస్తే, అలా రక్తం స్రవించినన్నాళ్లూ, నెలసరి రక్తస్రావంలో వలెనే ఆమె అపవిత్రంగా ఉంటుంది. 26 రక్త స్రావ సమయమంతటిలో ఆ స్త్రీ ఏ పడకమీద పరుండినా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో వలెనే ఉంటుంది ఆ పడక. ఆమె కూర్చొనేది ఏదైనా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో అపవిత్రమైనట్టే అపవిత్రం అవుతుంది. 27 ఆ వస్తువులను ఏ వ్యక్తి తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రుడవుతాడు. 28 ఆ తర్వాత ఆ స్త్రీ తన స్రావంనుండి పవిత్రం అయిన తర్వాత, ఆమె ఏడు రోజులు లెక్క పెట్టాలి. ఆ తర్వాత ఆమె పవిత్రం అవుతుంది. 29 అప్పుడు ఎనిమిదో రోజున ఆమె రెండు గువ్వలను లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని రావాలి. సన్నిధి గుడార ద్వారం వద్ద యాజకుని దగ్గరకు ఆమె వాటిని తీసుకొని రావాలి. 30 అప్పుడు ఒక పక్షిని పాపపరిహారార్థబలిగాను మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. అలా యాజకుడు యెహోవా ఎదుట ఆమెను పవిత్రం చేయాలి.
31 “అందుచేత ఇశ్రాయేలు ప్రజలు తమ అపవిత్రత విషయంలో వారి అపవిత్రతనుండి ప్రత్యేకించుకోవాల్సిందిగా మీరు హెచ్చరించాలి. మీరు ప్రజలను హెచ్చరించకపోతే, అప్పుడు వారు నా పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తారు. అప్పుడు వాళ్లు చావాల్సిఉంటుంది!”
32 స్రావంగల వారి విషయంలో అవి నియమాలు. వీర్యస్ఖలనం వలన అపవిత్రులైన పురుషులను గూర్చిన నియమాలు అవి. 33 మరియు నెలసరి రక్తస్రావం మూలంగా అపవిత్రమైన స్త్రీలకు అవి నియమాలు. అపవిత్రమైన స్త్రీతో శయనించి అపవిత్రమైన ఏ వ్యక్తికైనా అవి నియమాలు.
ప్రాయశ్చిత్త దినం
16 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు. 2 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు!
3 “ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి. 4 అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసుకొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.
5 “మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి. 6 అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి.
7 “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. 8 ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.[a]
9 “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి. 10 అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.
11 “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి. 12 అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి. 13 యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పుల మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు. 14 అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.
15 “తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి. 16 ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక.
17 “అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 18 తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి. 19 తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.
20 “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు. 21 బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు. 22 కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి.
23 “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి. 24 పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి. 25 అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి.
26 “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
27 “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి. 28 తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
29 “ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు. 30 ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు. 31 ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది.
32 “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి. 33 అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి. 34 ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.”
కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.
రాష్ట్రపాలకుడైన పిలాతుయొద్దకు యేసుని తీసికొనిపొవటం
(మార్కు 15:1; లూకా 23:1-2; యోహాను 18:28-32)
27 తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు. 2 వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.
యూదా ఆత్మహత్య
(అపొ. కా. 1:18-19)
3 యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ, 4 “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు.
వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.
5 యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.
6 ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు. 7 వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. 8 అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు. 9-10 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి,
“వాళ్ళు ముప్పై వెండి నాణెములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.”[a]
పిలాతు సమక్షంలో యేసు
(మార్కు 15:2-5; లూకా 23:3-5; యోహాను 18:33-38)
11 యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?”
అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
12 ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు.
13 అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు.
14 యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది.
మరణదండన విధించటం
(మార్కు 15:6-15; లూకా 23:13-25; యోహాను 18:39–19:16)
15 పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. 16 ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు.
17 అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు. 18 అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు.
19 పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది.
20 బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు.
21 “ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు.
“బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
22 “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు.
అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు.
23 “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు.
కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు.
24 లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు.
25 ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు.
26 ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు.
© 1997 Bible League International