Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 39-40

యాజకుల ప్రత్యేక వస్త్రాలు

39 పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.

ఏఫోదు

బంగారు తీగ, శ్రేష్ఠమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు. బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని. ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి. దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.

రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగించారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు. తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడింది.

న్యాయతీర్పు పథకం

తర్వాత న్యాయతీర్పు పైవస్త్రం బెసలేలు చేసాడు. నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది. న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు. 10 తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్నాయి. 11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి. 12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి. 13 నాలుగవ వరుసలో రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి. 14 ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది.

15 న్యాయతీర్పు పైవస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో అల్లిక చేయబడింది. 16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు. 17 తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయతీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు. 18 బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు. 19 తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు. 20 భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. ఏఫోదు దట్టీకి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలు ఉన్నాయి. 21 తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.

యాజకులకు ఇతర వస్త్రాలు

22 తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక నిపుణుని పనితనం. 23 అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.

24 తర్వాత నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు ధూమ్ర వర్ణపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు. 25 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు. 26 అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.

27 అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి. 28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు. 29 నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.

30 తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు. 31 తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి, దానిని తలపాగాకు కట్టారు.

పవిత్ర గుడారాన్ని మోషే తనిఖీ చేయటం

32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు. 33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు. 34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.

35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. 36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు. 37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు. 38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు. 39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు. 40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకులను వారు అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.

41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.

42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు. 43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.

పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు

40 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు: “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు. ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి. తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు. ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.

“పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు. ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి. ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.

“అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు. 10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది. 11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.

12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. 13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు. 14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి. 15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.” 16 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం అతడు చేసాడు.

17 కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిలబెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు. 18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు. 19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటిని చేసాడు.

20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు. 21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు. 22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు. 23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు. 24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు. 25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.

26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు. 27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. 28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.

29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.

30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు. 31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు. 32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.

33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.

యెహోవా మహిమ

34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. 35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.

36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు. 37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు. 38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.

మత్తయి 23:23-39

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International