Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 17-19

అహరోను ప్రధాన యాజకుడని దేవుడు రుజువు చేయటం

17 మోషేతో యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి పన్నెండు చేతికర్రలు తీసుకురా. పన్నెండు వంశాలలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి. లేవీ వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి. సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఒక్క మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ప్రజలు నీకు, నాకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపుచేస్తాను.”

కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి మధ్య అహరోను కర్ర ఉంది. మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు.

ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది. కనుక యెహోవా స్థానం నుండి మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు.

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా వారు చావకుండా ఉంటారు.” 11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు.

12 ఇశ్రాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా నశించిపోయాము. 13 ఎవరైనా యెహోవా పవిత్ర స్థలం సమీపంగా వచ్చినా సరే చస్తారు. మేము అందరము చనిపోతామా?” అని మోషేతో అన్నారు.

యాజకుల, లేవీయుల పని

18 అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచారాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరేకంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు బాధ్యులు. నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు సహాయం చేస్తారు. లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు. వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు.

“పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత, ఇశ్రాయేలు ప్రజల మీద నేను మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం. అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.”

అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా చెప్పాడు: “నాకు అర్పించబడిన అర్పణలన్నింటిమీద నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు నాకు అర్పించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. ఎప్పుడూ అవి మీకే చెందుతాయి. దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి. 10 అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి.

11 “ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు.

12 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు. 13 ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ అవి తినవచ్చును.

14 “ఇశ్రాయేలులో యెహోవాకు అర్పించబడిన ప్రతిదీ నీదే.

15 “ఒక కుటుంబంలో, మనిషికి గాని జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు అర్పించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే చెందుతుంది. 16 వారు ఒక నెల వయసులో ఉన్నప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల అయిదు తులాల వెండి.

17 “అయితే ఆవులలో, గొర్రెలలో మేకలలో మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ జంతువులు పవిత్రం – పరిశుభ్రం. వాటి రక్తం బలిపీఠం మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది హోమంగా అర్పించబడిన అర్పణ. దీని వాసన యెహోవానగు నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. 18 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే. 19 పవిత్ర కానుకలుగా ప్రజలు అర్పించేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేను ఇస్తాను, ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్ధానం. నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.”

20 అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు స్వంతంగా కలిగి ఉన్నవి ఏవి నీకు స్వంతంగా ఉండవు. నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. అయితే నీకు మాత్రం నేనే నీ కానుకగా ఉంటాను.

21 “ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం. 22 అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించి మరీచస్తారు. 23 సన్నిధి గుడారంలో పనిచేసే లేవీ ప్రజలే, దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ ఆజ్ఞ భవిష్యత్ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని లేవీ ప్రజలు మాత్రం పొందరు. 24 అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతునాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.”

25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 26 “లేవీ ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు చెందుతుంది. అయితే అందులో పదోవంతు యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి. 27 పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ యెహోవాకు మీ అర్పణలు. 28 ఈ విధంగా ఇతర ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహోవాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. దానిలో పదోవంతును మీరు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29 ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానంతటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, వాటిలో శ్రేష్ఠమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యేకించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు.

30 “మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారి పంటలో నుండి, ద్రాక్షారసంలో నుండి పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో శ్రేష్ఠమైన భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి. 31 మిగిలి పోయినదంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం. 32 మరియు ఎల్లప్పుడూ దానిలోని శ్రేష్ఠ భాగాన్నే మీరు యెహోవాకు ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.”

ఎర్ర ఆవు బూడిద

19 మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. ఆ ఆవును యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఎలియాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి. అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి. అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు.

“అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది.

10 “ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.

“ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది. 11 ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. 12 ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు. 13 ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు.

14 “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. 15 మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. 16 ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు అపవిత్రుడౌతాడు.

17 “కనుక అతనిని మరల పవిత్రం చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. 18 పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి.

19 “అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు.

20 “ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో. 21 ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు. 22 అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”

మార్కు 6:30-56

యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-14)

30 అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. 31 వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు. 34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.

35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది. 36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

37 కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు.

“రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.

38 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు.

వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.

39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.

41 యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.

42 అందరూ సంతృప్తిగా తిన్నారు. 43 శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.

యేసు నీళ్ళపై నడవటం

(మత్తయి 14:22-33; యోహాను 6:16-21)

45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు. 46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.

47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. 50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.

యేసు రోగులనేకులను నయం చేయటం

(మత్తయి 14:34-36)

53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు. 54 వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. 55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు. 56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International