Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 23-24

ప్రత్యేక పండుగలు

23 మోషేతో యెహోవా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:

సబ్బాతు

“ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.

పస్కా

“ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి. మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.

పులియని రొట్టెల పండుగ

“అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి. ఈ సెలవుల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”

ప్రథమ ఫలాల పండుగ

మోషేతో యెహోవా చెప్పాడు: 10 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి. 11 ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు.

12 “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి. 13 ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. 14 దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటికీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.

పెంతెకొస్తు పండుగ

15 “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి. 16 ఏడు వారాల తర్వాత ఆదివారం నాడు (అంటే యాభైయవ రోజు) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి. 17 ఆ రోజున అనగా ఆదివారంనాడు మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.

18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి. 19 పాపపరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.

20 “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి. 21 అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజున మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.

22 “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”

బూరల పండుగ

23 మరల మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి. 25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి.”

ప్రాయశ్చిత్త దినం

26 మోషేతో యెహోవా చెప్పాడు, 27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 28 ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఎందుచేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.

29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. 30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”

పర్ణశాలల పండుగ

33 మరల మోషేతో యెహోవా చెప్పాడు, 34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనవ తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది. 35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజున మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.

37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలిఅర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి. 38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.

39 “ఏడవ నెల పదిహేనవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి. 41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి. 42 ఏడు రోజులు తాత్కాలిక పర్ణశాలల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి. 43 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేశానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యెహోవాను!”

44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు.

దీపస్తంభం, పవిత్ర రొట్టెలు

24 మోషేతో యెహోవా చెప్పాడు: “గానుగ ఆడిన ఒలీవలనుండి పవిత్ర తైలం తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె దీపాల కోసం. ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి. సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్లు అహరోను చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. యెహోవా ఎదుట స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూఉండాలి.

“మంచి రకం గోధుమ పిండి తీసుకొని, దానితో పన్నెండు రొట్టెలు చేయాలి. ఒక్కో రొట్టెకు నాలుగు పావుల గోధుమపిండి ఉపయోగించాలి. యెహోవా ఎదుట బంగారు బల్లమీద ఆ రొట్టెలను రెండు వరుసలుగా పెట్టాలి. ఒక్కో వరుసలో ఆరు రొట్టెలు ఉండాలి. ఒక్కో వరుసమీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్పించబడిన హోమాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకొనేట్టు చేస్తుంది. ప్రతి సబ్బాతు నాడు అహరోను ఈ రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యెహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”

దేవుణ్ణి శపించిన మనిషి

10 ఒక ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు ఉన్నాడు. వాని తండ్రి ఈజిప్టువాడు. ఈ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలుపెట్టాడు. 11 ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు తీసుకొని వచ్చారు. (అతని తల్లి పేరు షెలోమితు, దాను కుటుంబ వంశానికి చెందిన దిబ్రీ కుమార్తె) 12 ప్రజలు వాణ్ణి బందీగా పట్టి, యెహోవా ఆజ్ఞ వివరంగా తెలియటం కోసం కనిపెట్టారు.

13 అప్పుడు మోషేతో యెహోవా చెప్పాడు: 14 “ఆ శపించినవాణ్ణి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. తర్వాత ప్రజలంతా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. 15 ఇశ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు: ఎవడైనా తన దేవుణ్ణి శపిస్తే వాడు ఈ విధంగా శిక్షించబడాలి. 16 యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణచేస్తే, వాణ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాణ్ణి రాళ్ళతో కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడిలాగానే, విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.

17 “ఇంకా, ఒకడు మరొక వ్యక్తిని చంపేస్తే, అలాంటివాణ్ణి చంపివేయాలి. 18 మరొకరికి చెందిన జంతువును చంపినవాడు ఆ జంతువుకు బదులుగా మరొక జంతువును ఇవ్వాలి.

19 “ఒకడు తన పొరుగువానికి గాయం చేస్తే, వానికి కూడా అలానే చేయాలి. 20 విరిగిన ఎముకకు విరిగిన ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకనికి ఎలాంటి దెబ్బలు తగిలితే, వాటి కారకునికి గూడా అలాంటి దెబ్బలే. 21 కనుక ఒకని జంతువును చంపినవాడు దాని స్థానంలో మరో జంతువును ఇవ్వాలి. అయితే మరొకడ్ని చంపినవాణ్ణి మాత్రం చంపివేయాలి.

22 “మీకు ఒకే రకం న్యాయం ఉంటుంది. మీ స్వంత దేశంలో ఉండే విదేశీయునికి కూడా అదే న్యాయం ఉంటుంది. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.”

23 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపివేసారు. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

మార్కు 1:1-22

యోహాను బోధించటం

(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)

దేవుని కుమారుడైన[a] యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను,
    ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”(A)

“‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము,
అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’
    అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”(B)

కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[b] ఇచ్చాడు.

యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.

అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”

యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం

(మత్తయి 3:13-17; లూకా 3:21-22)

ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.

యేసు శోధించపడటం

(మత్తయి 4:1-11; లూకా 4:1-13)

12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; లూకా 4:14-15)

14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; లూకా 5:1-11)

16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. 17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.

19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(లూకా 4:31-37)

21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. 22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International