Add parallel Print Page Options

యోహాను బోధించటం

(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:19-28)

కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో:

యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు.

హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు.

హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు.

లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.

ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు. దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

“‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన
బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో
    ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.
లోయలు పూడ్చివేయ బడుతాయి.
    కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి.
వంకర బాటలు చక్కగా ఔతాయి.
    కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”(A)

ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.

Read full chapter