Old/New Testament
స్వేచ్ఛాబలులు, అర్పణలు
1 యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.
3 “ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి[a] వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు. 4 ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
5 “ఆ వ్యక్తి యొక్క గిత్తను యెహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి. 6 అతడు ఆ పశువు చర్మాన్ని ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి. 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి. 8 యాజకులైన అహరోను కుమారులు ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. ఆ కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి. 9 ఆ పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
10 “ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి. 11 ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట ఆ జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 12 అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకుంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ కట్టెలు ఉంటాయి. 13 లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ జంతువు అవయవాలన్నింటినీ అర్పించి, బలిపీఠం మీద దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
14 “ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి. 15 అర్పణను యాజకుడు ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి. 16 యాజకుడు ఆ పక్షి మేత పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపీఠానికి తూర్పుగా పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పారవేసేచోటు. 17 అప్పుడు యాజకుడు ఆ పక్షి రెక్కలను పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయకూడదు. బలిపీఠం మీద అగ్నిలో ఉన్న కట్టెలపైన ఆ పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
ధాన్యార్పణలు
2 “ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి. 2 అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. 3 మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం.
కాల్చిన ధాన్యార్పణలు
4 “పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి. 5 పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి. 6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. 7 నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి.
8 “ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు. 9 ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 10 మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం.
11 “పులిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థంగాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద దహించకూడదు. 12 మొదటి పంటలో నుండి పులిసిన పదార్థాన్ని, తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొని రావచ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడకూడదు. 13 నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు తప్పక వేయాలి. నీవు అర్పించు ధాన్యార్పణలో ఉప్పు వేయవలెను.
మొదటి పంటనుండి ధాన్యార్పణలు
14 “మొదటి పంటలో నుండి నీవు యెహోవాకు ధాన్యార్పణ అర్పిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యార్పణ అవుతుంది. 15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. 16 ఒలిచిన ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు హోమమైయుండును.
సహవాస బలులు
3 “ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు. 2 ఆ వ్యక్తి ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 3 ఈ వ్యక్తి సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం చేయాలి. ఆంత్రములకు, లోపలి అవయవాలకు ఉండే కొవ్వు అంతటినీ అతడు అర్పించాలి. 4 మూత్రపిండాలను ఆ రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి. 5 అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం.
6 “ఒకవేళ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి. 7 అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి. 8 సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు. 9 అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి. వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి. 10 రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. 11 అప్పుడు యాజకుడు ఆ జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది.
12 “ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి. 13 సన్నిధి గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు ఆ మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 14 తర్వాత ఆ మేకలోని కొంతభాగాన్ని అతడు యెహోవాకు హోమం చేయాలి. లోపలి భాగాల్లోను, వాటి మీదను ఉండే కొవ్వును అతడు అర్పించాలి. 15 రెండు మూత్రగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ మేక నడుం దగ్గర కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి. 16 మేక అవయవాలను యాజకుడు దహనం చేయాలి. అది అగ్నితో అర్పించబడ్డ ఆహారం అవుతుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు మొత్తం యెహోవాకు చెందుతుంది. 17 మీ తరాలన్నింటికి శాశ్వతంగా ఈ నియమం కొనసాగుతుంది. మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని మీరు తినకూడదు.”
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మార్కు 13:1-31; లూకా 21:5-33)
24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. 2 యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.
3 యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.
4 యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. 5 ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. 6 యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. 7 దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. 8 అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.
9 “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.
15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.
19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.
22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.
23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.
26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.
© 1997 Bible League International