Old/New Testament
పవిత్ర గుడారపు ప్రతిష్ఠ
7 పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.
2 అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లెక్కబెట్టారు. 3 ఈ నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు.
4 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 5 “నాయకుల దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.”
6 కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. 7 గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. 8 తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. ఆ మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు బాధ్యుడు. 9 కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని.
10 బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు. 11 “ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు.
12-83 [a] పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా:
ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది.
ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి.
మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడు, అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడు, అమీహోదు కుమారుడైన ఎలీషామా తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాని తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడు, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
84 కనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకులనుండి వచ్చిన కానుకలు. మోషే ప్రత్యేక తైలము పోసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారు ఈ వస్తువులను తెచ్చారు. వెండి పళ్లెములు పన్నెండు, వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు వారు తీసుకుని వచ్చారు. 85 ఒక్కో వెండి పళ్లెం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 తులాలు. వెండిపళ్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 2,400 తులాల బరువు. 86 ధూపద్రవ్యంతో నిండిన పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపార్తులు కలిసి 120 తులాల బరువు కలవి.
87 దహనబలి అర్పణకు మొత్తం జంతువులు పన్నెండు కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి. 88 సమాధాన బలిగా వధించి ఉపయోగించేందుకు కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. ఈ జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్లలు 60 బలిపీఠం ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ అర్పణలుగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా బలిపీఠం మీద ప్రత్యేక తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ప్రతిష్ఠించారు.
89 యెహోవాతో మాట్లాడేందుకు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడుతున్న యెహోవా స్వరం అతడు విన్నాడు. ఒడంబడిక పెట్టెపైనున్న కరుణాపీఠంమీది రెండు కెరూబుదూతల మధ్య భాగంనుండి ఆ స్వరం వస్తోంది. ఇలా దేవుడు మోషేతో మాటలాడాడు.
దీప స్తంభం
8 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 2 “అహరోనుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. దీపస్తంభం ముందు భాగాన్ని ఆ దీపాలు వెలిగించాలి.”
3 అహరోను అలా చేసాడు. అహరోను ఆ దీపాలను సరైన చోట పెట్టి, దీపస్తంభం ముందు భాగాన్ని అవి వెలిగించేటట్టుగా అతడు వాటిని ఉంచాడు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడు. 4 దీపస్తంభం సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. దిమ్మదగ్గర మొదలుకొని బంగారు పూలవరకు అంతా బంగారమే. మోషేకు యెహోవా చూపించిన ప్రకారమే అదంతా చేయబడింది.
లేవీయులను ప్రతిష్టించటం
5 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 6 “ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి. 7 వారిని శుద్ధి చేసెందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్థ అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. ఈ జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది.
8 “అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబంధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ఈ ధాన్యార్ఫణ నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి. 9 లేవీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి తీసుకురావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చుట్టూరా సమావేశపర్చాలి. 10 అప్పుడు నీవు లేవీ ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకురావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు. 11 అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవలె ఉంటారు. ఈ విధంగా యెహోవాకు ప్రత్యేక పని చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు.
12 “లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరిహారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలు లేవీ ప్రజల పాపాలను కప్పిపుచ్చుతాయి. 13 అహరోను, అతని కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ఠ అర్పణగా లేవీ మనుష్యులను యెహోవాకు అర్పించు. 14 ఈ విధంగా లేవీ మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై ఉంటారు.
15 “కనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతిష్ఠార్పణగా వారిని యెహోవాకు అర్పించు. ఇలా చేసిన తర్వాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని చేయవచ్చును. 16 ఈ లేవీయులు నాకు ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్ఠించబడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ఠ కుమారుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరించాను. 17 ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషిగాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, కనుక మొదట పుట్టినవారు నావారై ఉండాలని పెద్ద కుమారులను మీ నుండి వేరు చేసాను. 18 ఇప్పుడు నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి స్థానంలో నేను వీరిని తీసుకున్నాను. 19 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనష్యులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను కప్పిపుచ్చే బలులు అర్పించుటలో వారు సహాయం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని సమీపించినా ఏ గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి కలుగదు.”
20 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు జరిగించారు. 21 లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను క్షమించే అర్పణలను కూడా అర్పించి, అహరోను వారిను పవిత్రం చేసాడు. 22 ఆ తర్వాత లేవీ మనుష్యులు వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయులయ్యారు.
23 మోషేతో యెహోవా చెప్పాడు: 24 “ఇది లేవీ ప్రజలకు ఒక ప్రత్యేక ఆజ్ఞ. 25 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల ప్రతి లేవీ మనిషి సన్నిధి గుడారం దగ్గరకు వచ్చి అక్కడ పని చేయాలి. 25 అయితే ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు. 26 50 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల పురుషులు సన్నిధి గుడారం దగ్గర వారి సోదరులకు సహాయం చేయవచ్చును. కాని వారే స్వయంగా ఆ పని చేయకూడదు. వారిని విరమించుకోనివ్వవచ్చు. లేవీ ప్రజలకు వారి పనులను చెప్పేటప్పుడు ఇది చెప్పటం జ్ఞాపకం ఉంచుకో.”
నీకున్న గ్రహింపును ఉపయోగించుకొనుము
(లూకా 8:16-18)
21 ఆయన మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం మీద పెడతారు. 22 దాచబడినవన్నీ బహిరంగమౌతాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి. 23 వింటున్న మీరు జాగ్రత్తగా వినండి.” 24 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మీరు విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలిచి యిస్తారో అదే కొలతతో యింకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. 25 వున్నవానికి దేవుడు యింకా ఎక్కువగా యిస్తాడు. లేనివాని దగ్గరనుండి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు.”
పెరిగే విత్తనం యొక్క ఉపమానం
26 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు. 27 అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు. 28 భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది. 29 పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు.”
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19)
30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు. 34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; లూకా 8:22-25)
35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు. 36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది. 38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.
39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.
40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International