Old/New Testament
ఇతర పాపాలకు అపరాధ పరిహారార్థబలి
6 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 2 “ఒకడు యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరోధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన దాన్ని గూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు, లేక ఎవర్నయినా మోసం చేయవచ్చు, 3 లేక ఒకడు పోయింది దొరికినప్పుడు దాన్ని గూర్చి అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి తర్వాత అతడు వాగ్దాన ప్రకారం చేయకపోవచ్చు, లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు. 4 ఒక వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా అబద్ధం చెప్పినదాన్ని, లేక 5 దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చివేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సొంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి. 6 ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన పొట్టేలు. ఆ పొట్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా ఉండాలి. అది యెహోవాకు అపరాధ పరిహారార్థ బలి. 7 అప్పుడు యాజకుడు యెహోవా దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి చేసిన పాపాన్ని నిర్మూలిస్తాడు. అప్పుడు అతణ్ణి దేవుడు క్షమిస్తాడు.”
దహనబలులు
8 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 9 “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి. 10 యాజకుడు తన నారబట్ట అంగీని ధరించాలి. అతడు తన నార చెడ్డీని వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా పోయాలి. 11 అప్పుడు యాజకుడు తన బట్టలు తీసి వేసి వేరే బట్టలు ధరించాలి. తర్వాత అతడు ఆ బూడిదను బస వెలుపల ఒక ప్రత్యేక స్థలానికి తీసుకొని వెళ్లాలి. 12 అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి. 13 ఎల్లప్పుడూ ఆగకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
ధాన్యార్పణలు
14 “ధాన్యార్పణలకు గల విధి ఇది. అహరోను కుమారులు యెహోవాకు బలిపీఠం ఎదుట దీనిని తీసుకొని రావాలి. 15 ధాన్యార్పణలోనుంచి పిడికెడు మంచి పిండిని యాజకుడు తీసుకోవాలి. ధాన్యార్పణ మీద నూనె, సాంబ్రాణి ఉండాలి. ధాన్యార్పణాన్ని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది ఇష్టమైన సువాసనగాను, యెహోవాకు జ్ఞాపకార్థ అర్పణగాను ఉంటుంది.
16 “మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, అతని కుమారులు తినాలి. ధాన్యార్పణ పొంగని రొట్టెలా ఉంటుంది. యాజకులు ఈ రొట్టెను పవిత్ర స్థలంలో తినాలి. సన్నిధి గుడారపు ఆవరణలో వారు ఈ ధాన్యార్పణను తినాలి. 17 ధాన్యార్పణను పులిసిన పదార్థం లేకుండా చేయాలి. అగ్నిద్వారా నాకు అర్పించబడిన అర్పణల్లో అది వారి భాగంగా నేను దానిని ఇచ్చాను. పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలి అర్పణలా అది కూడ అతి పవిత్రం. 18 యెహోవాకు అగ్నిద్వారా అర్పించబడిన అర్పణల్లోనుంచి అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణల స్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.”
యాజకుల ధాన్యార్పణం
19 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 20 “అహరోను, అతని కుమారులు యెహోవాకు తీసుకొని రావాల్సిన అర్పణలు ఇవి. అహరోను అభిషేకించబడిన రోజున వారు ఇలా చేయాలి. తూమెడు మంచి పిండిలో పదోవంతు వారు ఎల్లప్పుడూ ధాన్యార్పణగా తీసుకొనిరావాలి. అందులోనుంచి సగం ఉదయం, సగం సాయంత్రం వారు తీసుకొని రావాలి. 21 మంచి పిండిని నూనెతో కలిపి, పెనం మీద దాన్ని చేయాలి. అది ఉడికిన తర్వాత దానిని మీరు లోనికి తీసుకొని రావాలి. ధాన్యార్పణాన్ని మీరు భాగాలుగా చేయాలి. దానిని మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
22 “అహరోను, తర్వాత అతని సంతానంవారు ఎవరైతే అహరోను స్థానంలో అభిషేకించబడతారో వారు ఈ ధాన్యార్పణాన్ని యెహోవాకు పెట్టాలి. ఇది శాశ్వత నియమము, ధాన్యార్పణాన్ని యెహోవాకు పూర్తిగా దహించాలి. 23 యాజకుల ప్రతీ ధాన్యార్పణను పూర్తిగాకాల్చాలి. దానిని తినకూడదు.”
పాప పరిహారార్థ బలి నియమం
24 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 25 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు: పాప పరిహారార్థ అర్పణ విధి ఇది. యెహోవా ఎదుట దహనబలి పశువు వధించబడే చోటనే పాపపరిహారార్థ బలి పశువుకూడ అర్పించ బడాలి. అది అతి పరిశుద్ధం. 26 పాపపరిహారార్థబలిని అర్పించే యాజకుడే దానిని తినాలి. సన్నిధి గుడారం యొక్క ఆవరణలో ఒక పరిశుద్ధ స్థలంలో అతడు దానిని తినాలి. 27 పాపపరిహారార్థబలి మాంసాన్ని తాకిన ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడవుతాడు. మరియు తాకిన ప్రతి వస్తువూ పరిశుద్ధం అవుతుంది.
“చిలకరించబడిన రక్తం ఏ బట్టలమీద పడినా, మీరు ఆ బట్టలను ఉతకాలి. పరిశుద్ధ స్థలంలో మీరు ఆ బట్టలను ఉతకాలి. 28 పాపపరిహారార్థ బలి గనుక మట్టి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను పగుల గొట్టివేయాలి. పాపపరిహారార్థ బలిని ఇత్తడి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను తోమి, నీళ్లతో కడగాలి.
29 “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. 30 కానీ పాపపరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, అప్పుడు ఆ పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి వేయాలి. ఆ పాపపరిహారార్థ బలిని యాజకులు తినకూడదు.
అపరాధ పరిహారార్థ బలులు
7 “అపరాధ పరిహారార్థ బలుల నియమాలు ఇవి. ఇది అతి పరిశుద్ధం. 2 దహనబలి అర్పణలు వారు ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
3 “అపరాధ పరిహారార్థ బలిలోని కొవ్వు అంతటినీ యాజకుడు అర్పించాలి. దాని కొవ్విన తోకను, దాని లోపలి భాగాలమీది కొవ్వును, 4 రెండు మూత్ర గ్రంథులను, వాటిమీది కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, కార్జం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్పించాలి. దానిని మూత్ర గ్రంథులతో బాటు అతడు తీసివేయాలి. 5 వీటన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అవి యెహోవాకు హోమంగా అర్పించబడ్డ అర్పణలు అవుతాయి. అది అపరాధ పరిహారార్థబలి.
6 “యాజకుని కుటుంబంలో ఏ పురుషుడైనాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి. 7 అపరాధి పరిహారార్థ బలి కూడా పాపపరిహారార్థ బలిలాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. బలులను చేసే యాజకుడు ఆహారంగా ఆ మాంసం తీసుకొంటాడు. 8 బలి అర్పణ చేసే యాజకుడు దహన బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును. 9 ధాన్యార్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందుతుంది. పొయ్యిమీద వండిన ప్రతి ధాన్యార్పణ, పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ ఆ యాజకునిదే అవుతుంది. 10 ధాన్యార్పణలన్నీ అహరోను కుమారులకే చెందుతాయి. అవి పొడివైనా, లేక నూనెతో కలుపబడినా భేదం ఏమీ లేదు. అహరోను కుమారులు (యాజకులు) అందరూ ఈ ఆహారాన్ని పంచుకోవాలి.
సహవాస బలులు
11 “ఒక వ్యక్తి యెహోవాకు అర్పించాల్సిన సమాధాన బలులను గూర్చిన విధి ఇది. 12 ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు తేవచ్చును. కృతజ్ఞతలు చెల్లించేందుకు అతడు తన బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిన పులియని రొట్టెలను, నూనె పూసిన పొంగని అప్పడాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు అతడు అర్పించాలి. 13 సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి. 14 సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి ఆ రొట్టెలలో ఒకటి చెందుతుంది. 15 ఈ సమాధాన బలి అర్పించిన రోజునే దాని మాంసం తినివేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా ఒకడు కానుక అర్పిస్తాడు. కాని దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు.
16 “ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజమైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి. 17 అయితే ఈ బలి పశువు మాంసం మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద కాల్చివేయాలి. 18 సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. ఆ వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. ఆ బలి ఆపవిత్రం అవుతుంది. ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
19 “ఏదైనా అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని కూడా ప్రజలు తినకూడదు. అలాంటి మాంసాన్ని వారు అగ్నితో కాల్చివేయాలి. పరిశుద్ధమైన ప్రతివ్యక్తి మాంసం తినవచ్చును. 20 కాని అపవిత్రమైనవాడు ఒకడు, యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం తిన్నట్లయితే, అతణ్ణి తన ప్రజల్లోనుండి వేరు చేయాలి.
21 “ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు, లేక అపవిత్రమైన జంతువు కావచ్చు, లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”
22 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 23 “ఇశ్రాయేలు ప్రజలతో పశువుల, గొర్రెల, మేకల కొవ్వును మీరు తినకూడదని చెప్పు. 24 వాటంతట అవే చచ్చినా, లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం ఎప్పుడూ తినకూడదు. 25 యెహోవాకు హోమంగా అర్పించబడిన జంతువు కొవ్వును ఒక వ్యక్తి తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరు చేయాలి.
26 “మీరు ఎక్కడ నివసించినాసరే జంతువు రక్తంగాని, పక్షిరక్తంగాని ఎప్పుడూ మీరు తినకూడదు. 27 ఎవరైనా సరే ఈ రక్తాన్ని తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరుచేయాలి.”
దైవార్పిత బలుల విధులు
28 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 29 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ఒక వ్యక్తి సమాధాన బలిని యెహోవాకు తీసుకొని వస్తే ఆ కానుకలో కొంత భాగాన్ని యెహోవాకు ఆ వ్యక్తి ఇవ్వాలి. 30 కానుకలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. ఆ బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ నైవేద్యము. 31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. 32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి. 33 సమాధాన బలి పశువు రక్తాన్ని మరియు కొవ్వును అర్పించే యాజకునికే సమాధాన అర్పణలోని కుడి తొడ చెందుతుంది. 34 నైవేద్యంలోని బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రాయేలు ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన విధి.”
35 యెహోవాకు అగ్నిచేత అర్పించబడు అర్పణల్లో, ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి. అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా పని చేసినప్పుడు బలి అర్పణల్లో వారికి కొంతభాగం లభిస్తుంది. 36 యెహోవా, యాజకులను అభిషేకించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవలెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ భాగాలను యాజకులకు ఇవ్వాలి.
37 దహన బలి అర్పణ, నైవేద్యము, పాపపరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, యాజకుల నియామకం, సమాధాన బలి విధులు అవి. 38 సీనాయి పర్వతంమీద మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
ముగ్గురు సేవకుల ఉపమానం
(లూకా 19:11-27)
14 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు. 15 ఒకనికి ఐదు తలాంతుల[a] ధనం ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 16 ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు. 17 అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. 18 కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు.
19 “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు. 20 ఐదు తలాంతులు పొందినవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా! మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
21 “ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు.
22 “రెండు తలాంతులు పొందిన వాడు కూడా వచ్చి, ‘అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. నేను మరో రెండు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
23 “ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు.
24 “తదుపరి ఒక తలాంతు పొందినవాడు వచ్చి ‘అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని పొలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు. 25 అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!’ అని అన్నాడు.
26 “ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘నీవు దుర్మార్గుడివి! సోమరివి! నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది. 27 అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.’
28 “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి. 29 ఎందుకంటే ఉన్న వాళ్ళకు దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసి వేయబడుతుంది. 30 ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.
© 1997 Bible League International