లూకా 19:11-27
Telugu Holy Bible: Easy-to-Read Version
పది మీనాల ఉపమానం
(మత్తయి 25:14-30)
11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. 13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. 14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.
15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. 16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. 21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.
22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. 23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు. 24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.
25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.
26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి. 27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.
Read full chapter© 1997 Bible League International