Old/New Testament
బలుల నియమాలు
15 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి చెప్పు: మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు యెహోవాకు బలులు అర్పించాలి. 3 ఈ అర్పణల్లో కొన్నింటిని మీరు అగ్నితో దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొర్రెలమందల్లోనుండి మీరు అర్పణలు ఇవ్వాలి. ఇది యెహోవాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ యెహోవాకు చాల ఇష్టం.
4 “ఆ సమయంలో తన అర్పణను తెచ్చేవాడు యెహోవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యార్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు పడుల పిండి. 5 ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి.
6 “మీరు ఒక పొట్టేలును అర్పిస్తుంటే కూడ ధాన్యార్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి. 7 ఒక పడి ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. దాన్ని యెహోవాకు అర్పించు. అది ఆయన్ని సంతోషపెడుతుంది.
8 “అర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడెదూడను సిద్ధం చేయవచ్చు. 9 కనుక ఆ కోడెదూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొనిరావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి. 10 మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం. 11 నీవు యెహోవాకు అర్పించే ప్రతి కోడెదూడ, పోట్టేలు, గొర్రెపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం చేయబడాలి. 12 నీవు అర్పించే ప్రతి జంతువుకూ నీవు ఇలా చేయాలి.
13 “ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి. 14 మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి. 15 ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట. 16 అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరికి ఇవే ఆజ్ఞలు, నియమాలు.”
17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 18 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకొని వెళ్తున్నాను. 19 ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. 20 మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. 21 ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరుకొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.
22 “మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి? 23 ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి. 24 అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి.
25 “కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. 26 ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు.
27 “అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటించటం మరచిపోతే, అతడు ఒక సంవత్సరపు ఆడ మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. 28 ఆ పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ చెల్లింపును అర్పిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించ బడతాడు. 29 పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నానని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ.
30 “కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం. 31 అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు దోషిగానే ఉంటాడు.”
విశ్రాంతి రోజున ఒకడు పని చేయటం
32 ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు. 33 అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు. 34 ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు.
35 అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు. 36 కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు.
దేవుని ఆజ్ఞలు జ్ఞాపకముంచుకొను పద్ధతి
37 మోషేతో యెహోవా అన్నాడు: 38 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి. 39 మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు. 40 మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు. 41 నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
మోషే మీద కొందరి నాయకుల తిరుగుబాటు
16 కోరహు, దాతాను, అబీరాము, ఓను అనువారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాములు సోదరులు, ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు). దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు. 2 ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు. 3 వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పుకోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచివారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు.
4 మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి). 5 అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు. 6 అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి. 7 రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.”
8 కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి. 9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా? 10 యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. 11 నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.”
12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము. 13 పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు. 14 మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకొని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు ఏవి నీవు మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.”
15 అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు.
16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు. 17 మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.”
18 కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు. 19 కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది.
20 మోషే, అహరోనులతో యెహోవా 21 “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.
22 అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు.
23 అప్పుడు యెహోవా మోషేతో 24 “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు.
25 మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు. 26 మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”
27 కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు.
28 అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను. 29 ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం. 30 కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.”
31 మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది. 32 అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది. 33 వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లేకుండా పోయారు.
34 నాశనం చేయబడుతోన్న మనుష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు.
35 తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది.
36 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 37-38 “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!”
39 కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలియాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలియాజరు. అప్పుడు ఆ వెడల్పు రేకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు. 40 మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యెహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యెహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.
అహరోను ప్రజల్ని రక్షించటం
41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.
42 మోషే, అహరోనులు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది. 43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.
44 అప్పుడు యెహోవా మోషేతో 45 “ఇప్పుడు నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.
46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.
47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు. 48 బ్రతికి ఉన్నవాళ్లకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది. 49 అయితే వారి పాపం నిమత్తం అహరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు. 50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; లూకా 4:16-30)
6 యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు. 2 విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు. 3 ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.
4 యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. 5 యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు. 6 వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:1, 5-15; లూకా 9:1-6)
7 ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ, 8 వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి. 9 చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. 11 ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.”[a]
12 వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మత్తయి 14:1-12; లూకా 9:7-9)
14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము[b] నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
15 “ఆయన ఏలియా” అని కొందరన్నారు.
“ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.
16 కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.
బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం
17 క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. 19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. 20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.
21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది.
హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. 23 “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.
24 ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది.
“బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.
25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.
26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
© 1997 Bible League International