Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 23-25

బిలాము మొదటి సందేశం

23 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు. బిలాము అడిగినట్టే బాలాకు అవన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు.

అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.

అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.

అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా.

కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు. అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు
    రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు.
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!
    ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు,
    వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు
    అందుచేత నేనుకూడ వారిని శపించలేను.
ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు
    అందుచేత నేను అలా చేయలేను.
కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను.
    ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను.
ఒంటరిగా బ్రతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను,
    వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
10 ఇసుక రేణువులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”

11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.

12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.

13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు. 14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.

15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు.

16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు. 17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.

బిలాము రెండో సందేశం

18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బాలాకూ లేచి నా మాట విను.
    సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను.
19 దేవుడు మనిషికాడు,
    ఆయన అబద్ధం చెప్పడు.
దేవుడు మానవ కుమారుడు కాడు,
    ఆయన నిర్ణయాలు మారవు.
ఏదైనా చేస్తానని యెహోవా చెబితే
    ఆయన అలానే చేస్తాడు.
యెహోవా ఒక వాగ్దానం చేస్తే,
    ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
    యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు.
    ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు.
యెహోవా వారి దేవుడు,
    ఆయన వారితో ఉన్నాడు.
మహారాజు వారితో ఉన్నాడు.
22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు.
    అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు.
23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు.
    ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు.
‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి,
    ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు.
    సింహంలా వారు పోరాడతారు.
ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు.
    తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”

25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో.

26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు.

27 అప్పుడు బాలాకు, “అలాగైతే నాతో మరో బలిపీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ దేవుడు సంతోషించి, అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని బిలాముతో చెప్పాడు. 28 కనుక బాలాకు పీయోరు కొండకు బిలామును తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని చూడవచ్చు.

29 “ఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత బలికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు బిలాము. 30 బిలాము అడిగినట్టు బాలాకు చేసాడు. ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బాలాకు బలిగా వధించాడు.

బిలాము మూడో సందేశం

24 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు. బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు.
నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను.
    నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను.
    నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.

“యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
భూమి మీద మీ గుడారాలు లోయల్లా
    పరచుకొన్నాయి.
అవి నదీ తీరంలో
    తోటలా ఉన్నాయి.
యెహోవా నాటిన అది చక్కటి
    సువాసనగల మొక్కలా ఉంది.
అది నీళ్ల దగ్గర పెరిగే
    అందమైన చెట్లలా ఉంది.
మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది.
    మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు.
ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు.
    వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.

“ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు.
    వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు.
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు.
    వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు.
వారు నిద్రపోతున్న కొదమ
    సింహంలా ఉన్నారు.
దానిని మేల్కొలి పేందుకు
    ఎవడికి ధైర్యం చాలదు.
నిన్ను ఆశీర్వదించే వారు
    ఆశీర్వాదం పొందుతారు.
నిన్ను ఎవరైనా శపిస్తే వారికి
    గొప్ప కష్టాలు వస్తాయి.”

10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. 11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”

12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”

బిలాము చివరి సందేశం

15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి.
విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి.
    మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను.
    నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను.
    నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.

17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు.
    ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు.
యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది.
    ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు.
    షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు.
అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు[a] దొరుకుతాయి.

19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
పట్టణంలో ఇంకా బ్రతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”

20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది.
    కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!

21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం.
    ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు.
అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”

23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు:

“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బ్రతకలేడు.
24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి.
ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి.
    అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి.”

25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.

పెయోరు దగ్గర ఇశ్రాయేలీయులు

25 ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురుషులు మోయాబీ స్త్రీలతో లైంగిక పాపం చేయటం మొదలు పెట్టారు. 2-3 మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.

“ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా ఎదుట పడవేయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవా కోపగించడు” అని మోషేతో యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలీయుల న్యాయమూర్తులతో “పెయోరులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొక్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని చంపేయాలి” అని మోషే చెప్పాడు.

ఆ సమయంలో మోషే, మరియు ఇశ్రాయేలు పెద్దలు అంతా సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ స్త్రీని తన ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. మోషే, మరియు పెద్దలు అందరు చూసేటట్టుగా వాడు ఇలా చేసాడు. మోషే, ఆ పెద్దలు చాల విచారపడ్డారు. అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు. ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఆ ఇశ్రాయేలు వానిని, మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఆ ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లిద్దర్నీ ఫీనెహాసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది. ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.

10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 11 “యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. ప్రజల మధ్య నా మర్యాద కాపాడటానికి అతడు ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న ప్రకారం ప్రజలను చంపను. 12 కనుక నేను ఫీనెహాసుతో ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి. 13 అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసింది.”

14 మిద్యానీ స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు మగవాడు సాలు కుమారుడైన జిమ్రీ. షిమ్యోను వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు. 15 చంపబడిన మిద్యానీ స్త్రీ పేరు కొజ్బీ. ఆమె షూరు కూమార్తె. షూరు మిద్యానీ ప్రజల్లో నాయకుడు. అతడు తన వంశానికి పెద్ద.

16 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 17 “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి. 18 ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొలిచేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ నాయకుని కుమార్తె కొజ్బీని మీ వాడొకడు దాదాపు వివాహం చేసుకునేంత పని చేసారు వారు. అదే ఇశ్రాయేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీ. పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవుణ్ణి కొలిచిన కారణంగానే ఆ రోగం వచ్చింది.”

మార్కు 7:14-37

14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. 16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.

17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)

20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”

యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం

(మత్తయి 15:21-28)

24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[a] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.

27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[b] అని అన్నాడు.

28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.

29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.

30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.

చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం

31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.

33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International