Old/New Testament
యొర్దాను నది తూర్పున ఇశ్రాయేలు వంశాలు
32 రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదేశాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పశువులకు బాగున్నట్టు వారికి కనబడింది. 2 కనుక రూబేను, గాదు వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, యాజకుడైన ఎలియాజరుతో, ప్రజా నాయకులతో వారు మాట్లాడారు. 3-4 వారు ఇలా చెప్పారు: “మీ సేవకులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.) 5 మీకు ఇష్టమైతే ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతున్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని తీసుకొని వెళ్లొద్దు.”
6 రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా? 7 ఇశ్రాయేలు ప్రజలను మీరెందుకు అధైర్యపరుస్తున్నారు? నది దాటకుండా, యెహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా చేస్తారు మీరు. 8 మీ తండ్రులు నాకు అలాగే చేసారు. కాదేషు బర్నేయ దగ్గర దేశాన్ని పరిశీలించి రావటానికి గూఢచారులను నేను పంపించాను. 9 వారు ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపర్చారు. యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు. 10 ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఇలా ప్రమాణం చేసాడు: 11 ‘ఈజిప్టు నుండి వచ్చిన వారిలో 20 సంవత్సరాలుగాని అంతకంటె ఎక్కువ వయసుగాని ఉన్నవారెవరూ ఈ దేశాన్ని చూడలేరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసాను. ఈ దేశాన్ని ఈ మనుష్యులకు ఇస్తానని నేను వాగ్దానం చేసాను. కానీ వీరు నన్ను వాస్తవంగా అనుసరించలేదు. కనుక వీరికి ఈ దేశం దక్కదు. 12 కెనెజీ వాడగు యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వాస్తవంగా యెహోవాను వెంబడించారు!’
13 “ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది. అందుచేతనే ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే యెహోవా వుండనిచ్చాడు. యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలందరూ చనిపోయేంతవరకు వారిని యెహోవా అక్కడనే ఉండనిచ్చాడు. 14 ఇప్పుడు మీరు మీ తండ్రులు చేసిన పాపమే మళ్లీ చేస్తున్నారు. పాపాత్ములైన ప్రజలారా, యెహోవా ఆయన ప్రజల మీద మరింత ఎక్కువగా కోపగించాలని మీరు కోరుతున్నారా? 15 మీరు యెహోవాను వెంబడించటం మానివేస్తే, ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువ కాలం అరణ్యంలో ఉండేటట్టు యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు ప్రజలందరినీ నాశనం చేస్తారు!”
16 కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా చెప్పారు: “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు కట్టుకుంటాము. 17 ఇశ్రాయేలీయులను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత ప్రాకారంగల పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి. 18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము. 19 యొర్దాను నదికి పశ్చిమదిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి తూర్పు దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.”
20 కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవుతుంది. కానీ మీ సైనికులు మాత్రం యెహోవాకు ముందు యుద్ధానికి వెళ్లాలి. 21 మీ సైనికులు యొర్దాను నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టుచేయాలి. 22 ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు యెహోవా మనందరికీ సహాయం చేసిన తర్వాత, మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకోనిస్తాడు. 23 కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి. 24 మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే, మీరు మీ ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.”
25 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము. 26 మా భార్యలు, పిల్లలు, మా పశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు. 27 కానీ, నీ సేవకులమైన మేము మాత్రం యొర్దాను నది దాటుతాము. అయితే మా యజమాని చెప్పినట్టు మేము యెహోవా ముందర యుద్ధానికి ముందడుగువేస్తాం.”
28 కనుక ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రమాణాన్ని మోషే, యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యోహోషువ, ఇశ్రాయేలు వంశాల నాయకులు అందరూ విన్నారు. 29 మోషే వారితో చెప్పాడు: “గాదు, రూబేను ప్రజలు యొర్దాను నది దాటుతారు. వారు యెహోవాముందు యుద్ధానికి నడుస్తారు. మీరు దేశాన్ని వశం చేసుకునేందుకు వారు సహాయం చేస్తారు. దేశంలో వారి భాగంగా గిలాదు ప్రాంతాన్ని మీరు వారికి ఇవ్వవలెను. 30 కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మీకు సహాయం చేస్తామని వారు ప్రమాణం చేస్తున్నారు.”
31 గాదు, రూబేను ప్రజలు జవాబిచ్చారు: “యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మేము చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. 32 మేము యొర్దాను నది దాటి, యెహోవా ముందు కనాను దేశంలోకి నడుస్తాము. అయితే ఈ దేశంలో మా భాగం మాత్రం యొర్దాను నది తూర్పు ప్రదేశం.”
33 కనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే వంశంలో సగంమంది ప్రజలకు ఆ ప్రదేశాన్ని మోషే ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీవాడగు సీహోను రాజ్యం, బాషాను రాజైన ఓగు రాజ్యం ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి.
34 గాదు ప్రజలు దీబోను, అతారోతు, అరోయేరు, 35 అత్రోతు షోపను, యాజెరు, యోగ్‌బహ, 36 బేత్ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు.
37 రూబేను ప్రజలు హెష్బోను, ఏలాలే, కిర్యాతాయిము 38 నెబో, బయల్మెయోను, షిబ్మా పట్టణాలను నిర్మించారు. వారు మరల కట్టిన పట్టణాలకు పాత పేర్లనే ఉపయోగించారు. అయితే నెబో, బయల్మెయోను పేర్లను వారు మార్చివేసారు.
39 మాకీరు వంశం నుండి ప్రజలు గిలాదుకు వెళ్లారు. (మాకీరు మనష్షే కుమారుడు.) వారు ఆ పట్టణాన్ని ఓడించారు. అక్కడ నివసించిన అమోరీయులను వారు ఓడించారు. 40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. 41 మనష్షే వాడైన యాయీరు అక్కడి చిన్న పట్టణాలను ఓడించాడు. అప్పుడు వాటిని యాయీరు పల్లెలు అని అతడు పిల్చాడు. 42 నాతును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు తన స్వంత పేరు పెట్టాడు.
ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వెళ్లిపోవుట
33 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను వంశాలవారీగా ఈజిప్టునుండి బయటకు నడిపించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి. 2 ఆ ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. యెహోవా కోరిన విషయాలను మోషే వ్రాశాడు. ఆ ప్రదేశాలు ఇవి:
3 మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు. 4 యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.
5 ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు. 6 సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు. 7 వారు ఏతాము విడిచి పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెఫోను దగ్గర ఉంది. మిగ్దోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు.
8 ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.
9 ప్రజలు మారాను విడిచి ఏలీము వెళ్లి అక్కడ నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. 10 ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు.
11 ప్రజలు ఎర్ర సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసంచేసారు.
12 ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.
13 ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం చేసారు.
14 ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు నీరు దొరకలేదు.
15 ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.
16 ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబ్రోతు హత్తావాలో నివాసం చేసారు.
17 ప్రజలు కిబ్రోతు హత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.
18 ప్రజలు హజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం చేసారు.
19 ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో నివాసం చేసారు.
20 ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో నివాసం చేసారు.
21 ప్రజలు లిబ్నా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు.
22 ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం చేసారు.
23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు.
24 ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో నివాసం చేసారు.
25 ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం చేసారు.
26 ప్రజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం చేసారు.
27 ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం చేసారు.
28 ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం చేసారు.
29 ప్రజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం చేసారు.
30 ప్రజలు హష్మోనా విడిచివెళ్లి మొసెరోతులో నివాసం చేసారు.
31 ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో నివాసం చేసారు.
32 ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్ హగ్గిద్గాదులో నివాసం చేసారు.
33 ప్రజలు హోర్ హగ్గిద్గాదు విడిచివెళ్లి యొత్బాతాలో నివాసం చేసారు.
34 ప్రజలు యొత్బాతా విడిచివెళ్లి ఎబ్రోనాలో నివాసం చేసారు.
35 ప్రజలు ఎబ్రోనా విడిచివెళ్లి ఎసోన్గెబెరులో నివాసం చేసారు.
36 ప్రజలు ఎసోన్గెబెరు విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు.
37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. 38 యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం. 39 అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.
40 ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న కనానీ రాజు విన్నాడు. 41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు.
42 ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం చేసారు.
43 ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం చేసారు.
44 ప్రజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో ఉంది.
45 ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు.
46 ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను దిబ్లాతాయిములో నివాసం చేసారు.
47 ప్రజలు అల్మోను దిబ్లాతాయిము విడిచివెళ్లి నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు.
48 ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను నది దగ్గర అర్బత్ మోయాబులో నివాసం చేసారు. ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు నివాసం చేసారు. 49 బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలంవరకు వారి నివాసం ఆక్రమించుకొంది. ఇది అర్బత్ మోయాబు అనే చోట ఉంది.
50 అర్బత్ మోయాబు వద్ద మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన అన్నాడు: 51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారితో ఈ విషయాలు చెప్పు: మీరు యొర్దాను నది దాటుతారు. కనాను దేశంలోనికి మీరు వెళతారు. 52 అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి. 53 ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందుకనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది. 54 మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసుకొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వాలి. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వాలి. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.
55 “ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు. 56 నేను వారికి ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానినే నేను మీకు కూడా చేస్తాను.”
కనాను—సరిహద్దులు
34 మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను దేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు. 3 దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది. 4 అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది. 5 అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది. 6 మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. 7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.) 8 హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది. 9 తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు. 10 మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది. 11 షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) ప్రక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది. 12 తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”
13 కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి. 14 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు. 15 ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”
16 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 17 “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు 18 అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు. 19 ఆ నాయకుల పేర్లు ఇవి:
యూదా వంశంనుండి – యెపున్నె కుమారుడు కాలేబు;
20 షిమ్యోను వంశంనుండి – అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
21 బెన్యామీను వంశంనుండి – కిస్లోను కుమారుడు ఎలీదాదు
22 దాను వంశంనుండి – యొగ్లి కుమారుడు బుక్కి
23 మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి
ఏఫోదు కుమారుడు హన్నీయేలు
24 ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి – షిఫ్తాను కుమారుడు కెమూయేలు
25 జెబూలూను వంశంనుండి – పర్నాకు కుమారుడు ఎలీషాపాను
26 ఇశ్శాఖారు వంశంనుండి – అజాను కుమారుడు పల్తీయేలు
27 ఆషేరు వంశంనుండి – షెలోమి కుమారుడు అహీహోదు
28 నఫ్తాలి వంశంనుండి – అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”
29 ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; లూకా 9:43b-45)
30-31 వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు. 32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మత్తయి 18:1-5; లూకా 9:46-48)
33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు. 34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు.
35 యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు.
36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, 37 “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు.
మనకు విరోధికానివాడు మనవాడే
(లూకా 9:49-50)
38 “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు.
39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. 40 ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మత్తయి 18:6-9; లూకా 17:1-2)
42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. 44 [a] 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46-47 [b] పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు(A)
49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.
50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
© 1997 Bible League International