Old/New Testament
25 “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు. 2 నిందితుడు కొరడా దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతణ్ణి బోర్లా పండుకోబెట్టాలి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి. 3 ఒక మనిషిని ఒకే సారి 40 కంటె ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అంతకంటె ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది.
4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు.
5 “ఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యాధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి. 6 అప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు నుండి రూపు మాసిపోదు. 7 ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి. 8 అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, ‘ఆమెను నేను స్వీకరించను’ అని చెబితే 9 అతని సోదరుని భార్య ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. ‘తన సోదరుని కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తున్నాను’ అని ఆమె చెప్పాలి. 10 అప్పుడు ఆ సోదరుని కుటుంబం ‘చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా’ ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది.
11 “ఇద్దరు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ వుండవచ్చును. వారిలో ఒకని భార్య తన భర్తకు సహాయం చేయటానికి రావచ్చును. కాని ఆమె అవతల వాని పురుషాంగములను లాగకూడదు. 12 ఆమె అలా చేస్తే ఆమె చేతిని నరికి వేయాలి. ఆమెను గూర్చి విచారించవద్దు.
13 “మనుష్యుల్ని మోసం చేయటానికి తూనికెలో దొంగ రాళ్లు ఉంచవద్దు. మరీ బరువుగా గాని, మరీ తేలికగా గాని ఉండే రాళ్లు ఉపయోగించవద్దు. 14 మరీ పెద్దవి లేక చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో ఉంచవద్దు. 15 సరిగ్గాను, నిజాయితీగాను ఉండే రాళ్లు, కొలతలు నీవు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నీవు చాలా కాలం జీవిస్తావు. 16 తప్పుడు తూకాలు, కొలతలు ఉపయోగించే వాళ్లను మీ దేవుడైన యెహోవా అసహ్యించుకొంటాడు. అవును, తప్పు చేసే వాళ్లందర్నీ ఆయన అసహ్యించుకొంటాడు.
అమాలేకీయులు నాశనం చేయబడాలి
17 “మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకోండి. 18 అమాలేకీయులు దేవుణ్ణి గౌరవించలేదు. మీరు అలసి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లు మీమీద దాడి చేసారు. వెనుక నడుస్తోన్న మీ ప్రజలందర్నీ వాళ్లు చంపేసారు. 19 అందుకే అమాలేకీయుల జ్ఞాపకం కూడ ప్రపంచంలో లేకుండా మీరు నాశనం చేయాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు దీనిని చేయాలి. అక్కడ మీ చుట్టూరా ఉన్న శత్రువులందరి నుండి ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే అమాలేకీయులను నాశనం చేయటం మాత్రం మరచిపోవద్దు.
ప్రథమ పంట
26 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు 2 మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. 3 అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.
4 “అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. 5 అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. అతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. 6 ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. 7 అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. 8 అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్యాలు ఆయన చేశాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. 9 కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’
“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.
12 “ప్రతి మూడవ సంవత్సరం దశమభాగాల సంవత్సరం. ఆ సంవత్సరం మీ పంటలోని దశమ భాగాలన్నీ అర్పించటం పూర్తి అయ్యాక దానిని మీరు లేవీయులకు, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు ఇవ్వాలి. అప్పుడు వారు ప్రతి పట్టణంలో తిని తృప్తి పడవచ్చు. 13 మీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలి: ‘నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం) నేను నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. నేను వాటిని మరచిపోలేదు. 14 నేను దుఃఖ సమయంలో ఈ ఆహారాన్ని తినలేదు. నేను అపవిత్రంగా ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని కూర్చలేదు. ఈ ఆహారంలో ఏదీ చనిపోయిన వారికి నేను అర్పించలేదు. యెహోవా, నా దేవా, నేను నీకు విధేయుడనయ్యాను. నీవు నాకు ఆదేశించిన వాటన్నింటినీ నేను చేసాను. 15 పరలోకంలోని నీ పవిత్ర నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.’
యెహోవా ఆజ్ఞలకు విధేయులు కావాలి
16 “ఈ ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ మీరు విధేయులు కావాలని నేడు మీ దేవుడైన యెహోవా మీకు ఆదేశిస్తున్నాడు. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో వాటిని జాగ్రత్తగా పాటించండి. 17 యెహోవా మీ దేవుడు అని ఈ వేళ మీరు చెప్పారు. ఆయన మార్గాల్లో నడుస్తామనీ, ఆయన ప్రబోధాలను పాటిస్తామనీ, ఆయన చట్టాలకు ఆజ్ఞలకు విధేయులం అవుతామనీ మీరు ప్రమాణం చేసారు. మీరు చేయాల్సిందిగా ఆయన చెప్పే ప్రతిదీ చేస్తామనీ మీరు చెప్పారు. 18 ఈ వేళ యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా స్వీకరించాడు. ఆయన దీన్ని మీకు వాగ్దానం చేసాడు. మీరు ఆయన ఆదేశాలన్నింటికీ విధేయులు కావాలని కూడా యెహోవా చెప్పాడు. 19 యెహోవా తాను చేసిన రాజ్యాలన్నింటికంటె మిమ్మల్ని గొప్పవాళ్లనుగా చేస్తాడు. మెప్పు, కీర్తి, ఘనత ఆయన మీకు ఇస్తాడు. మరియు ఆయన వాగ్దానం చేసినట్టు మీరు ఆయన స్వంత ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.”
ప్రజలకోసం రాళ్ల జ్ఞాపికలు
27 మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి. 2 మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి. 3 ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న – పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు.
4 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశించినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి. 5 మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు. 6 మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి. 7 మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి. 8 మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.”
దేవుని నియమాలకు ప్రజల సమ్మతి
9 లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడి ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు. 10 కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.”
11 అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా చెప్పాడు: 12 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత గెరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రకటించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను. 13 శాపం ప్రకటించటానికి రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి.
14 “అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పాలి:
15 “‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
16 “అప్పుడు లేవీయులు ‘తన తల్లినిగానీ తండ్రిని గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
17 “అప్పుడు లేవీయులు ‘తన పొరుగువాని సరిహద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
18 “అప్పుడు లేవీయులు ‘గుడ్డివాడు, దారి తప్పి పోయేటట్టు నడిపించేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
19 “అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
20 “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
21 “‘ఏ జంతువుతోనైనా లైంగిక సంపర్కం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
22 “‘తన సోదరితోగాని, తన తండ్రి కుమార్తెతోగాని, తన తల్లి కుమార్తెతోగాని లైంగిక సంబంధం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చేప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
23 “‘తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
24 “అతడు పట్టుబడనప్పటికీ ‘రహస్యంగా మరొకడ్ని చంపినవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
25 “‘నిర్దోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసుకొనేవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
26 “‘ధర్మశాస్త్రాన్ని బలపర్చకుండా, దీనికి విధేయుడు కానివాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం
(మత్తయి 26:31-35; లూకా 22:31-34; యోహాను 13:36-38)
27 యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో,
‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను!
గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’(A)
అని వ్రాయబడింది. 28 కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
29 అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.
30 యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు[a] సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.
31 కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మత్తయి 26:36-46; లూకా 22:39-46)
32 అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. 33 కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం,[b] ఆవేదన కలగటం మొదలుపెట్టింది. 34 ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు.
35 ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ, 36 ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.
37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా? 38 మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు.
39 యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. 40 ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు.
41 యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. 42 లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; లూకా 22:47-53; యోహాను 18:3-12)
43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.
44 ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో[c] ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. 45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. 46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు. 47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.
48 యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? 49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. 50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.
51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, 52 అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
మహాసభ సమక్షంలో యేసు
(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)
53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు.
© 1997 Bible League International