Old/New Testament
ఇతర ఆజ్ఞలు
22 “నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి. 2 ఆ యజమాని నివాసం నీకు దగ్గర్లో లేకపోతే, లేక అది ఎవరిదో నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవరకు నీవు దానిని నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు అతనికి దానిని తిరిగి ఇచ్చివేయాలి. 3 నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలోనైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి.
4 “నీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్తటానికి నీవు అతనికి సహాయం చేయాలి.
5 “ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
6 “నీవు దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి పక్షి పిల్ల పక్షులతోగాని గుడ్లమీదగాని కూర్చొని ఉంటే పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు. 7 పిల్ల పక్షుల్ని నీవు తీసుకొనవచ్చు. కాని నీవు తల్లిని పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం బ్రతుకుతావు.
8 “నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని పై కప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. అప్పుడు ఆ యింటి మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద ఉండదు.
జతపర్చబడకూడని విషయాలు
9 “నీ ద్రాక్షపొలంలో రెండు రకాల విత్తనాలు నీవు విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు పంట, నీ పొలంలోని ద్రాక్ష రెండూ నిష్ప్రయోజనం.[a]
10 “గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు.
11 “ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు.
12 “నీవు ధరించే అంగీకి నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి.
వివాహ చట్టాలు
13 “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు. 14 ‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు. 15 ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమె కన్య అనే రుజువు తీసుకొని రావాలి. 16 ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె అతనికి ఇష్టం లేదు. 17 ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని అతడు అన్నాడు. అయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను[b] పట్టణ పెద్దలకు చూపించాలి. 18 అప్పుడు ఆ పట్టణ పెద్దలు అతన్ని పట్టుకొని శిక్షించాలి. 19 నూరు వెండితులాలు వారు అతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
20 “అయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే 21 అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.
లైగింక పాపాలు
22 “ఒక పురుషుడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
23 “మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే 24 మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తొలగించాలి.
25 “అయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి. 26 ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరొక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను. 27 ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.
28 “ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే 29 అప్పుడు అతడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
30 “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి అవమానం కలిగించకూడదు.
ఆరాధనలో పాల్గొనలేని మనుష్యులు
23 “ఈ వ్యక్తులు యెహోవాను ఆరాధించుటలో ఇశ్రాయేలు ప్రజల్లో భాగంగా ఉండకూడదు. వృషణాలు గాయపడినవాడు, పురుషాంగం కోసివేయబడ్డవాడు 2 లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు.
3 “అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం కాజాలరు. 4 ఎందుకంటే, మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమ్మోనీయులు, మోయాబీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరించారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము[c] లోని పెతోరు పట్టణపువాడైన బెయొరు కుమారుడు బిలాము.) 5 అయితే యెహోవా దేవుడు బిలాము మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీర్వాదంగా యెహోవా మార్చాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. 6 అమ్మోనీ ప్రజలతోగాని, మోయాబీ ప్రజలతో గాని సమాధాన పడేందుకు మీరు ఎన్నడూ ప్రయత్నించకూడదు. మీరు జీవించినంత కాలం వారితో స్నేహంగా ఉండవద్దు.
ఇశ్రాయేలీయులు అంగీకరించాల్సిన ప్రజలు
7 “ఎదోము వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతడు మీకు బంధువు. ఈజిప్టు వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతని దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు. 8 ఎదోము, ఈజిప్టు వాళ్ల మూడో తరంవారి పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండవచ్చును.
సైన్యం పాళెమును పరిశుభ్రంగా ఉంచటం
9 “మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి. 10 రాత్రిపూట కలలో తడిసి అపవిత్రమైన వాడు మీ మధ్య ఎవడైనా ఉంటే అతడు మీ పాళెము నుండి బయటకు వెళ్లిపోవాలి. అతడు పాళెమునుండి దూరంగా ఉండాలి. 11 అయితే సాయంకాలం అతడు స్నానంచేయాలి. సూర్యుడు అస్తమించాక అతడు పాళెములోనికి రావచ్చును.
12 “నీకు పాళెము వెలుపల బహిర్భూమిగా ఒక స్థలం ఉండాలి. 13 మరియు నీ ఆయుధాలతో పాటు ఒక కట్టె నీకు ఉండాలి; నీవు బహిర్భూమికి వెళ్లవల్సినప్పుడు ఆ కట్టెతో నీవు ఒక గుంట తవ్వుకొని తర్వాత దానిని పూడ్చివేయాలి. 14 ఎందుకంటే మిమ్మల్ని రక్షించి, మీ శ్రతువులను ఓడించటానికి మీ దేవుడైన యెహోవా మీ పాళెములో ఉన్నాడు. అందు చేత మీ పాళెము పవిత్రంగా ఉండాలి. అప్పుడు మీ మధ్యలో అపరిశుభ్రం లేదని చూసి, మీ దగ్గరనుండి వెళ్లిపోడు.
ఇతర ఆజ్ఞలు
15 “బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారిపోయి నీ దగ్గరకు వస్తే, ఆ బానిసను నీవు తిరిగి అతని యజమానికి అప్పగించకూడదు. 16 ఈ బానిస నీతో, తనకు ఇష్టం వచ్చిన చోట నివసించవచ్చును. అతడు కోరుకొన్న పట్టణంలో నివసించవచ్చు. నీవు అతన్ని తొందరపెట్టకూడదు.
17 “ఇశ్రాయేలు పురుషుడేగాని, స్త్రీగాని ఎన్నటికీ ఆలయ వేశ్య కాకూడదు. 18 ఒక వేశ్య లేక పురుషగామి సంపాదించిన డబ్బును నీ దేవుడైన యెహోవా ఆలయానికి తీసుకొని రాకూడదు. దేవునికి చేసిన మొక్కు బడి చెల్లించటానికి ఎవరూ ఆ డబ్బు ఉపయోగించకూడదు. మీ దేవుడైన యెహోవాకు వ్యభిచారులు అంటే అసహ్యం.
19 “మరో ఇశ్రాయేలు వానికి నీవు డబ్బు అప్పు ఇస్తే, నీవు వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ ఆర్జించిపెట్టే దేనిమీదగానీ, డబ్బు మీద, ఆహారం మీదగాని వడ్డీ వసూలు చేయవద్దు. 20 ఒక విదేశీయుని దగ్గర నీవు వడ్డీ తీసుకోవచ్చును. కానీ మరో ఇశ్రాయేలువాని దగ్గర మాత్రం నీవు వడ్డీ తీసుకోకూడదు. ఈ నియమాలు నీవు పాటిస్తే, నీవు నివసించబోయే దేశంలో నీవు చేసే వాటన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
21 “నీ దేవుడైన యెహోవాకు నీవు ఒక వాగ్దానం చేస్తే, నీ వాగ్దానం అంతటినీ చెల్లించేందుకు వెనుకాడవద్దు. ఎందుకంటే, నీవు దాన్ని చెల్లించాలని నీ దేవుడైన యెహోవా అడుగుతాడు. నీవు వాగ్దానం చేసినదానిని చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది. 22 నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు. 23 కానీ నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ్ఛందంగా వాగ్దానం చేసినప్పుడు, నీ వాగ్దానం ప్రకారం నీవు చేయాలి.
24 “మరొకరి ద్రాక్షా పొలంగుండా నీవు వెళ్లినప్పుడు, నీవు కోరినన్ని ద్రాక్షాపండ్లు నీవు తినవచ్చును. కానీ నీ బుట్టలో మాత్రం ద్రాక్షాపండ్లు ఏమీ వేసుకోకూడదు. 25 నీవు మరొకరి పంట పొలంలోనుంటి వెళ్లినప్పుడు నీవు నీ చేతుల్తో వెన్నులు త్రుంచుకొని తినవచ్చును. కానీ అవతలివాడి పంట తీసుకొనేందుకు నీవు కొడవలితో కోయకూడదు.
24 “ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకొన్న తర్వాత ఆమెను గూర్చిన రహస్యం ఏదో తెలిసి ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే అతడు విడాకుల పత్రం వ్రాసి, దానిని ఆమెకు ఇవ్వాలి. అప్పుడు అతడు ఆమెను తన ఇంటినుండి పంపించి వేయాలి. 2 ఆమె అతని ఇల్లు విడిచి వెళ్లిపోయాక, ఆమె మరొకనికి భార్య కావచ్చును. 3-4 అయితే ఒకవేళ ఆ కొత్త భర్తకుకూడా ఆమె నచ్చకపోవటంతో అతడు ఆమెను వెళ్లగొట్టవచ్చును. ఒకవేళ అతడు ఆమెకు విడాకులు ఇచ్చినా, మొదటి భర్త ఆమెను మళ్లీ తన భార్యగా చేర్చుకోకూడదు. లేక ఆమె కొత్త భర్త చనిపోతే, మొదటి భర్త ఆమెను మరల తన భార్యగా చేర్చుకోకూడదు. అతనికి ఆమె అపవిత్రమయిందిగా ఉంటుంది. అతడు ఆమెను మళ్లీ పెళ్లి చేసుకొంటే, యెహోవాకు అసహ్యమైనదానిని అతడు చేసినవాడవుతాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ఇలా పాపం చేయకూడదు.
5 “ఒక పురుషునికి పెళ్లయిన కొత్తలోనే అతణ్ణి సైన్యంలోనికి పంపకూడదు. అతనికి ఎలాంటి ప్రత్యేక పనినీ విధించకూడదు. ఒక్క సంవత్సరం అతడు ఇంటి దగ్గరే ఉండి, తన కొత్త భార్యను సంతోషపెట్టేందుకు అతడు స్వేచ్చగా ఉండాలి.
6 “ఒకనికి నీవు ఏదైనా బదులు ఇస్తే, దానికి భద్రతగా అతని తిరుగటి రాయిని నీవు తీసుకోకూడదు. ఎందుకంటే, అది అతని భోజనాన్ని తీసుకొన్నట్టే అవుతుంది గనుక.
7 “ఒకడు తన స్వంత ప్రజల్లోనుండి (ఇశ్రాయేలు వాడ్ని) ఎత్తుకొనిపోయి, అతడ్ని బానిసగా వాడినా, అమ్మినా, ఆ ఎత్తుకు పోయినవాడు చావాల్సిందే. ఈ విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునైనా మీరు తొలగిస్తారు.
8 “కుష్ఠు రోగంవంటి వ్యాధి నీకు ఉంటే, లేవీ యాజకులు నీకు ప్రబోధించేవాటన్నింటినీ నీవు జాగ్రత్తగా పాటించాలి. చేయాల్సిందిగా నేను యాజకులకు చెప్పిన విషయాలను నీవు జాగ్రత్తగా పాటించాలి. 9 మీరు ఈజిప్టునుండి బయటకు వచ్చిన ప్రయాణంలో మిర్యాముకు[d] మీ దేవుడైన యెహోవా చేసినదాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
10 “నీవు ఎవరికైనా ఎలాంటి అప్పు ఇచ్చినా, దానికి భద్రతగా దేనినైనా తీసుకొనేందుకు నీవు అతని ఇంటిలోనికి వెళ్లకూడదు. 11 నీవు బయటనే నిలిచి ఉండాలి. అప్పుడు నీవు ఎవరికైతే అప్పు ఇచ్చావో అతడే దానికి భద్రతగా దేనినైనా బయటకు తెచ్చి నీకు ఇస్తాడు. 12 ఒకవేళ అతడు పేదవాడైతే అతని వస్తువును తెల్లవారేవరకు నీ దగ్గర ఉంచుకోకూడదు. 13 అతని వస్తువును ప్రతి సాయంత్రం నీవు అతనికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అతడు తన స్వంత బట్టలతో నిద్రపోగల్గుతాడు. అతడు నీకు కృతజ్ఞతలు చెబుతాడు, నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా చూస్తాడు.
14 “పేదవాడు, అవసరంలో ఉన్నవాడునైన జీతగాడ్ని నీవు మోసం చేయకూడదు. అతడు నీతోటి ఇశ్రాయేలు వాడైనా, మీ పట్టణాలు ఒక దానిలో నివసిస్తున్న విదేశీయుడైనాసరే. 15 ప్రతి రోజూ సూర్యుడు అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చి వేయాలి. ఎందుకంటే, అతడు పేదవాడు, ఆ డబ్బే అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నీవు పాప దోషివి అవుతావు.
16 “పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంపకూడదు. అలాగే తల్లిదండ్రులు చేసిన దేని కోసమూ పిల్లలను చంపకూడదు. ఒక వ్యక్తి స్వయంగా తాను చేసిన కీడు నిమిత్తము చంపబడాలి.
17 “విదేశీయులకు, అనాధలకు న్యాయం జరిగేట్టు నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టుగా బట్టలు నీవెన్నటికీ తీసుకోకూడదు. 18 మీరు ఒకప్పుడు ఈజిప్టులో బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడ్నుండి బయటకు తీసుకొనివచ్చాడని మరచిపోవద్దు. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19 “నీవు నీ పొలంలో పంటకూర్చుకొంటూ, మరచిపోయి ఒక పన అక్కడే విడిచిపెట్టావనుకో, నీవు మళ్లీ దానికోసం వెళ్లకూడదు. విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం అది ఉంటుంది. వారికోసం నీవు కొంత ధాన్యం విడిచిపెడితే, నీ ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. 20 నీవు నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలించేందుకు నీవు తిరిగి అక్కడకు వెళ్లకూడదు. నీవు అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, విధవలకు ఉంటాయి. 21 నీ ద్రాక్షతోటనుండి నీవు ద్రాక్షా పండ్లు కూర్చుకొనేటప్పుడు, నీవు విడిచిపెట్టిన పండ్లు తీసుకొనేందుకు నీవు తిరిగి అక్కడికి వెళ్లకూడదు. ఆ ద్రాక్షాపండ్లు విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం ఉంటాయి. 22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; లూకా 22:1-2; యోహాను 11:45-53)
14 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు. 2 “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు.
బేతనియ గ్రామంలో తైలాభిషేకం
(మత్తయి 26:6-13; లూకా 12:1-8)
3 ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.
4 ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? 5 దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు[a] వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.
6 యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది. 7 పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. 8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.[b] 9 ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం
(మత్తయి 26:14-16; లూకా 22:3-6)
10 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. 11 వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
పస్కా భోజనం
(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)
12 పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా[c] పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
13 యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. 14 అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి. 15 అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”
16 శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.
17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు. 18 వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
19 వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.
20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు. 21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.
ప్రభు రాత్రి భోజనము
(మత్తయి 26:26-30; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)
22 అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు.
23 ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు. 24 “ఇది నా నిబంధన[d] రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. 25 ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.
26 వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు.
© 1997 Bible League International