Add parallel Print Page Options

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మత్తయి 13:53-58; లూకా 4:16-30)

యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు. విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు. ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.

యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు. వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.

Read full chapter