Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 109:21-31

21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
    వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.

యెహెజ్కేలు 20:33-44

33 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నా జీవ ప్రమాణంగా, రాజునై మిమ్మల్ని పరిపాలిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాని నా శక్తివంతమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని చూపిస్తాను! 34 మిమ్మల్నందరినీ ఈ అన్యదేశాల నుండి వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను! 35 నేను గతంలో చేసినట్లు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడుతాను. 36 గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వికులకు తీర్పు తీర్చినట్లు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ నిర్ణయం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

37 “మీరు నేరస్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక[a] ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను. 38 నాపై తిరుగుబాటు చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగిస్తాను. మీ స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”

39 ఓ ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభువైన యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింపగోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, తరువాత నానుండి ఏదైనా సలహా మీకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ మాత్రం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.”

40 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి. 41 అప్పుడు మీరు సమర్పించే బలుల సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. అయినా నేను మిమ్మల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పైగా ఆయా దేశాలన్నీ ఇదంతా చూస్తాయి. 42 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసుకొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యం. 43 ఆ రాజ్యంలో మిమ్మల్ని మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు. 44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

లూకా 6:6-11

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)

మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.

10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International