Revised Common Lectionary (Complementary)
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
తెరహు కుటుంబ చరిత్ర
27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి. 28 కల్దీయుల ఊరు అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా, ఇస్కాలకు హారాను తండ్రి. 30 శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనుమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు. 32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.
నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు
(లూకా 12:33-34; 11:34-36; 16:13)
19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.
24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.
© 1997 Bible League International