Revised Common Lectionary (Complementary)
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.
18 నేను వారి పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర విగ్రహాల జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను మీరు పాటించవద్దు. 19 నేనే యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి. 20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”
21 “‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను. 22 కాని నాకు నేనే ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొని రావటం ఇతర రాజ్యాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసుకోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య జనుల ముందు సంహరించలేదు. 23 అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.
24 “‘ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించవారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ముఖ్యమైనవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అపవిత్ర విగ్రహాలను వారు పూజించారు. 25 అందువల్ల వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను. 26 వారి కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం బలి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజలను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.’ 27 కావున, ఓ నరపుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో మాట్లాడు. వారికిలా చేప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపై కుట్రపన్నారు. 28 అయినా నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. వారు కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, కోప కానుకలను[a] ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్పించారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు అర్పించారు. 29 వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు[b] అనే పిలవబడుతున్నాయి.’”
30 దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ మిమ్మును మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య[c] వలె ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను వదిలివేశారు. 31 మీరు కూడా అవే రకమైన కానుకలు సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. నా జీవ ప్రమాణంగా మీ ప్రశ్నలకు సమాధానమివ్వను. మీకు సలహా ఇవ్వను! 32 ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”
ఫిలదెల్ఫియలోని సంఘానికి
7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.
© 1997 Bible League International