Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 103:1-8

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.

2 దినవృత్తాంతములు 8:12-15

12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు. 13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు. 14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు. 15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.

అపొస్తలుల కార్యములు 17:1-9

థెస్సలొనీకలో

17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International