Revised Common Lectionary (Complementary)
తేత్
65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు
14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
15 మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు
శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను.
నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.
20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
అని నా దేవుడు చెబుతున్నాడు.
పెద్ద విందు ఉపమానం
(మత్తయి 22:1-10)
15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
© 1997 Bible League International