Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 73

మూడవ భాగం

(కీర్తనలు 73–89)

ఆసాపు స్తుతి కీర్తన.

73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
    పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
నేను దాదాపుగా జారిపోయి,
    పాపం చేయటం మొదలు పెట్టాను.
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
    ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
    వారు జీవించుటకు శ్రమపడరు.[a]
మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
    ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
    వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
    వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
    వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
    వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
    వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
    సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
    మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
    నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
    నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
    కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
    కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
    వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
    వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
    అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
    అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
    మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
    నీవు కనబడకుండా చేస్తావు.

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
    ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
    తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
    దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
    ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
    మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
    కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
    నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
    నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
    దేవుడు నా యెడల దయ చూపించాడు.
    నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
    దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

యోబు 40:6-14

అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:

“యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.

“యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా?
    నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?
యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా?
    నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా?
10 ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.
11 యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు.
    యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి.
12 అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు.
    వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు.
13 గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు.
    వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు
14 యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే
    అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడవని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.

యోబు 42:1-6

యెహోవాకు యోబు జవాబు

42 అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు.

“యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు.
    నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు.
    నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను.
    నేను తెలిసికోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.

“యెహోవా, ‘నీవు నాతో యోబూ, నేను నీతో మాట్లాడుతాను.
    నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను.
    కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
కనుక ఇప్పుడు, నన్ను గూర్చి
    నేను సిగ్గుపడుతున్నాను.
యెహోవా, నేను విచారిస్తున్నాను.
    నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”

లూకా 22:31-33

పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పటం

(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; యోహాను 13:36-38)

31 “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. 32 కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు.

33 కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.

లూకా 22:54-62

పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం

(మత్తయి 26:57-58, 69-75; మార్కు 14:53-54, 66-72; యోహాను 18:12-18, 25-27)

54 యేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరించాడు. 55 వాళ్ళు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు. 56 ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, “ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది.

57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. 58 కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు.

“నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.

59 ఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలిలయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” అని అన్నాడు.

60 “అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు.

అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. 61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. 62 పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International