Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 73

మూడవ భాగం

(కీర్తనలు 73–89)

ఆసాపు స్తుతి కీర్తన.

73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
    పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
నేను దాదాపుగా జారిపోయి,
    పాపం చేయటం మొదలు పెట్టాను.
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
    ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
    వారు జీవించుటకు శ్రమపడరు.[a]
మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
    ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
    వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
    వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
    వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
    వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
    వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
    సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
    మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
    నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
    నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
    కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
    కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
    వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
    వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
    అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
    అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
    మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
    నీవు కనబడకుండా చేస్తావు.

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
    ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
    తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
    దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
    ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
    మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
    కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
    నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
    నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
    దేవుడు నా యెడల దయ చూపించాడు.
    నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
    దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

యోనా 3

దేవుని పిలుపుకు యోనా విధేయత

పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీవు ఆ నీనెవె మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు వారికి బోధించు.”

యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యోనా నీనెవె నగరానికి వెళ్లాడు. నీనెవె ఒక మహా నగరం. ఎవరైనా నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి.

యోనా నగరం మధ్యకు వెళ్లి, ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. “నలభై రోజుల తరువాత నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు.

నీనెవె నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించటానికి, కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణయించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయటానికి ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యలు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు.

ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు తీసివేసి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు. రాజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని వ్రాసి, నగరమంతా ప్రకటింపజేశాడు.

రాజునుండి, అతని కింది పాలకులనుండి వచ్చిన ఆజ్ఞ ఏమనగా:

కొద్దికాలంపాటు ఏ మనిషిగాని, జంతువుగాని ఏమీ తినగూడదు. పశువుల మందలనుగాని, గొర్రెల మందలనుగాని పొలాల్లోకి వదలకూడదు. నీనెవెలో ఉన్న ఏ జీవీ ఏమీ తినకూడదు. నీళ్ళు తాగకూడదు. ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువూ విచార సూచకంగా ఒక ప్రత్యేకమైన బట్టతో తప్పక కప్పబడాలి. ప్రజలు బిగ్గరగా తమ గోడును దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తీ తన జీవన విధానం మార్చుకొని, చెడు పనులు చేయడం మానాలి. బహుశః అప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని, తాను చేయ సంకల్పించిన పనులు చేయక పోవచ్చు. బహుశః దేవుని మనస్సు మారవచ్చు. కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం శిక్షింపబడకపోవచ్చు.

10 ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడుపనులు చేయటం మానినట్లు దేవుడు గమనించాడు. కనుక దేవుడు మనసు మార్చుకొని, తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు.

2 పేతురు 3:8-13

కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.

10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International