Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

2 రాజులు 17:24-41

విదేశీయులు ఇశ్రాయేలులో స్థిరపడుట

24 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమ్రోను నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్యా, హమాతు, సెపర్వయీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. అతను వారినందరిని షోమ్రోనులో ఉంచాడు. ఆ ప్రజలు షోమ్రోనును గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగరాలలో నివసింపసాగారు. 25 ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి. 26 కొందరు అష్షూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి షోమ్రోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని సింహాలు చంపివేశాయి” అని చెప్పారు.

27 అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు షోమ్రోను నుండి కొందరు యాజకులను తీసుకున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని తిరిగి షోమ్రోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆ యాజకుడు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించగలడు.”

28 అందువల్ల అష్షూరుకు తీసుకుపోయిన ఒక యాజకుడు బేతేలులో నివసించాడానికి వచ్చాడు. ఈ యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి బోధించాడు.

29 కాని ఆ మనుష్యులందరు తమతమ దేవుళ్ల విగ్రహలను చేసి షోమ్రోనుల ఉన్నత స్థానాలలో ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు. 30 బబులోను మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్బెనోతును కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు. 31 అవ్వాకు చెందినవారు అసత్య దేవుడైన నిబ్హజు తర్తాకులను కల్పించుకున్నారు. హమాతు ప్రజలు అబద్ధపు దేవుడైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీయుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్లయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

32 కాని ఆ ప్రజలు యెహోవాని కూడా పూజించారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకులను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు అర్పించారు. 33 వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించినట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.

34 నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసిస్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు. 35 యెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అనుసరించకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరాధించకూడదు; వారికి బలుల కూడా సమర్పించకూడదు. 36 కాని యెహోవాని అనుసరించాలి. ఈజిప్టు నుంచి మిమ్ము తీసుకువచ్చిన యెహోవాయే దేవుడు. యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి వినియోగించాడు. మీరు యెహోవాని ఆరాధిస్తూ మరియు గౌరవించి ఆయనకు బలులు సమర్పించాలి. 37 ఆయన మీ కోసం వ్రాసిన నిబంధనలు, న్యాయ సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలైన వాటిని మీరు పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. మీరు ఇతర దేవతలను గౌరవించరాదు. 38 మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు. 39 మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.

40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. 41 అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.

1 తిమోతికి 3:14-4:5

14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. 16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.

క్రీస్తు మానవ రూపం ఎత్తాడు.
పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు.
దేవదూతలు ఆయన్ని చూసారు.
రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది.
ప్రజలు ఆయన్ని విశ్వసించారు.
ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.

దొంగ బోధకులు

చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International