Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
3 నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
నేను అలా చేయను!
4 నేను నిజాయితీగా ఉంటాను.
నేను దుర్మార్గపు పనులు చేయను.
5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
అతిశయించడం నేను జరుగనివ్వను.
6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
8 ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
అష్షూరువారు షోమ్రోనును పట్టుకొనుట
9 అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది). 10 మూడవ సంవత్సరము చివరను షల్మనేసెరు షోమ్రోనుని పట్టుకున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ సంవత్సరమున, అతను షోమ్రోనుని వశము చేసుకున్నాడు. (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది). 11 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు. 12 ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడంబడికను విచ్ఛిన్నం చేశారు. యెహోవా సేవకుడైన మోషే చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలు పెడ చెవిని పెట్టారు. మరియు ఆయన చేయమని చెప్పిన పనులు వారు చేయలేదు.
అష్షూరు యూదాని తీసుకొనుటకు సిద్ధపడుట
13 హిజ్కియా రాజుగా వున్న 14వ సంవత్సరములో అష్షూరు రాజయిన సన్హెరీబు యూదాలోని అన్ని బలిష్ఠ నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్హెరీబు ఆ నగరాలన్నిటిని ఓడించాడు. 14 అప్పుడు యూదా రాజయిన హిజ్కియా అష్షూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను ఒంటరిగా వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” అని హిజ్కియా చెప్పాడు.
తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కియాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని అడిగాడు. 15 హిజ్కియా యెహోవా ఆలయం నుండి, రాజుగారి నిధుల నుండీ వెండి అంతా తీసి ఇచ్చాడు. 16 ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. హిజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం ఉంచాడు. హిజ్కియా అష్షూరు రాజుకు ఈ బంగారమంతా ఇచ్చివేశాడు.
అష్షూరు రాజు యెరూషలేముకు మనుష్యులను పంపుట
17 అష్షూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బారీసు, రబ్బాకేను అను తన ముగ్గురు సైన్యాధిపతులను పెద్ద సైన్యముతో యెరూషలేములోని హిజ్కియా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి “చాకిరేవు” వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు. 18 వారు రాజుని పిలిచారు. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధికారి), షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవాహును (దస్తావేజులు సంరక్షించేవాడు) వారిని కలుసుకోడానికి వచ్చారు.
మంచి సేవకునిగా ఉండుము
6 నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. 7 ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. 8 శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. 9 ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.
11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.
© 1997 Bible League International