Revised Common Lectionary (Complementary)
2 అన్నీ చాల అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!”[a] అంటాడు ప్రసంగి.
జ్ఞానం ఆనందాన్ని ఇస్తుందా?
12 ప్రసంగి అనే ఉపదేశకుడనైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును. 13 నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను. 14 ఈ భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది.
18 దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను. 19 నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది.
20 అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది. 21 తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటినీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా.
22 ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి? 23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.
49 సర్వ దేశములారా, ఇది వినండి.
భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
4 సామెతపైనా ఆసక్తినుంచుతాను.
ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.
5 అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
వారు జంతువుల్లా మరణిస్తారు.
క్రొత్త జీవితం
3 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. 2-3 మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. 4 క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. 6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.[a] 7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. 9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. 10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. 11 ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి[b] భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
పిసినారి ఉపమానం
13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
© 1997 Bible League International