Revised Common Lectionary (Complementary)
9 అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు.
మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి. 10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.
11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.
12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.
13 సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి. 14 అప్పుడు నీవు యెహోవా, నాయందు దయచూపమని అడగవచ్చు. మరియు యెహోవా అంటాడు, భూమికి పైగా ఉన్నతమైన చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను నీకు భోజనం పెడ్తాను. నీ తండ్రి యాకోబుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక అవి జరుగుతాయి.
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి”(A) అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను”(B) అని అన్నాడు.
22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.
25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను”(C) అని వాగ్దానం చేసాడు. 27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.
28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”(D)
యేసు విశ్రాంతిరోజున ఒక స్త్రీని నయం చేయటం
10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. 11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. 12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” 13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? 16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. 17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
© 1997 Bible League International