Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
ప్రపంచ రాజ్యాలపై తీర్పు
15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము. 16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”
17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను. 18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.
19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.
20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను.
ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజా, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.
21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.
22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను.
దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను. 23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను. 24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు. 25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. 26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబులోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.
27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! క్రింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’
28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి! 29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.
44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. 45 ఆ తర్వాత ఇది మన పూర్వికులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు. 47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.
48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:
49 ‘ఆకాశం నా సింహాసనం!
భూమి నా పాదపీఠం!
నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు?
విశ్రాంతికి నాకు స్థలం ఏది?
50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”(A)
51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. 52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. 53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.
© 1997 Bible League International