Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
విశ్రాంతి రోజున ఒకడు పని చేయటం
32 ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు. 33 అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు. 34 ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు.
35 అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు. 36 కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు.
దేవుని ఆజ్ఞలు జ్ఞాపకముంచుకొను పద్ధతి
37 మోషేతో యెహోవా అన్నాడు: 38 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి. 39 మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు. 40 మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు. 41 నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
3 పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.
దేవుడు తండ్రిలాంటివాడు
4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. 5 మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:
“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
6 ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)
7 కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? 8 మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. 9 మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.
నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగావుండు
12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని[a] సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.
14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. 15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. 16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి. 17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.
© 1997 Bible League International