Revised Common Lectionary (Complementary)
సొలొమోను యాత్ర కీర్తన.
127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.
2 నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.
3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
5 తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[a] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.
వృద్దాప్యంలో ఎదురయ్యే సమస్యలు
12 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను”[a] అని నీవు వాపోయే వయస్సు రాక ముందు, నీవింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నీవు గుర్తుచేసుకో.
2 సూర్య చంద్రులూ, నక్షత్రాలూ నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, (నీవింకా యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నీవు జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే, (కష్టాలు పదే పదే వస్తాయి).
3 ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడిపోతాయి, నీవు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు మసకబారతాయి. 4 నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నీవు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)
5 ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగుతుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నీవు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నీవు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నీవు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు[b] వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు.
మరణం
6 నీ వెండి మొలతాడు తెగక ముందే,
బంగారు గిన్నె నలగక ముందే.
బావి దగ్గర పగిలిన మట్టి కుండలా,
(నీ జీవితం వృథా కాక ముందే) పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృథా కాకముందే
నీ యౌవనకాలంలోనే నీవు నీ సృష్టికర్తను స్మరించుకో.
7 మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం
నీవు మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసి పోతుంది.
కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ
నీవు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుడి దగ్గరకే పోతుంది.
8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి!
13-14 సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.
మొదట దేవుని రాజ్యం
(మత్తయి 6:25-34, 19-21)
22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. 23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. 24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. 25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. 30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. 31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
© 1997 Bible League International