Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89:1-18

ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.

89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
    ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
    నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!

దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
    నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
    నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.

2 దినవృత్తాంతములు 34:22-33

22 హిల్కీయా, రాజసేవకులు[a] కలిసి ప్రవాదిని హుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు. 23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము. 24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా[b] నా కోపం చల్లారదు!’

26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక, 28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు[c] తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.

29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. 30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది. 31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు. 32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు. 33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.

హెబ్రీయులకు 11:17-28

17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.

20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.

22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.

23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.

24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.

27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International