Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 109:21-31

21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
    వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.

యెహెజ్కేలు 20:1-17

ఇశ్రాయేలు దేవునినుండి తొలగిపోవుట

20 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులై), పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా ముందు కూర్చున్నారు.

అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పియున్నాడు.’ నీవు వారికి తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ నిర్ణయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి. వారికి నీవిలా చెప్పాలి, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా చేప్పాను: ‘నేను మీ దేవుడనైన యెహోవాను.’ ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం.[a] దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!

“‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ పారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను. అయినా నేను వారిని సంహరించలేదు. ఈజిప్టు నుండి నా ప్రజలను బయటకు తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను పాడుచేయదల్చుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు. 10 ఇశ్రాయేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను. 11 అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు. 12 ప్రత్యేక విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడా నేను వారికి చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజులు ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, వారిని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియజేస్తాయి.

13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను. 14 అయినా నేను వారిని సంహరించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడుచేసుకోదల్చలేదు. అందువల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహరించలేదు. 15 ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక వాగ్దానం చేశాను. వారికి నేనివ్వబోయే దేశంలోకి వారిని నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. ఆది పాలు, తేనె ప్రవహించే సుభిక్షమైన దేశం. అది దేశాలన్నిటిలోకీ సుందరమైన దేశం!

16 “‘ఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్యమైనవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ అపవిత్ర విగ్రహాలమీద లగ్నమై వుండుటచేత వారీ పనులన్నీ చేశారు. 17 కాని వారి స్థితిపట్ల నేను విచారం వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో వారిని నేను సర్వనాశనం చేయలేదు.

హెబ్రీయులకు 3:7-4:11

దేవుని ప్రజలకు విశ్రాంతి

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:

“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
    ఆయన సహనాన్ని పరీక్షించారు.
    కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
    మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
    ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
    నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
    కోపంతో ప్రమాణం చేశాను.’”(A)

12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:

“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
    కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)

16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.

“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
    ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(C)

అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(D) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.

ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:

“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
    మూర్ఖంగా ప్రవర్తించకండి.”(E)

యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International