Revised Common Lectionary (Complementary)
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
దేవుని పవిత్ర పెట్టె యధా స్థానానికి పంపబడుట
6 దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు. 2 ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాలో మాకు చెప్పండి” అని అడిగారు.
3 “మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.
4 “తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు.
“ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. 5 మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో. 6 ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.
7 “మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు.[a] 8 యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి. 9 బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.
10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశారు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు. 11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతిరూపాలను ఆ బండిమీద పెట్టారు. 12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.
13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి. 14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.
15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను క్రిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.
16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.
15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.
19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.
22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.
23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.
26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు.
© 1997 Bible League International