Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66:1-9

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.

2 రాజులు 21:1-15

యూదాలో మనష్షే దుష్ట పరిపాలన ప్రారంభించుట

21 మనష్షే పరిపాలన చేయడం మొదలుపెట్టిన నాటికి అతను పన్నెండేళ్లవాడు. అతను 55 సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.

యెహోవా తప్పని చెప్పిన పనులు మనష్షే చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనష్షే భయంకరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా, ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్లునట్లుగా యెహోవా చేశాడు). తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు. యెహోవా ఆలయంలో మనష్షే అబద్ధపు దేవుళ్లను గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యెరూషలేములో నాపేరు స్థాపిస్తాను.” అని యెహోవా చెప్పిన స్థలం ఇది. యెహోవా ఆలయము యొక్క రెండు ఆవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. మనష్షే తన కుమారుని బలిపీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని సోదె చెప్పేవారిని దర్శించాడు.

యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు కోపము వచ్చింది. మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు సొలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలేమును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము ఆలయములో ఎన్నటికీ వుంచుతాను. తమ దేశం విడిచి వెళ్లేటట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు మెలిగినచో, నా సేవకుడైన మోషేవారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.” కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని జనాంగముల వారు చేసిన దుష్టకార్యాముల కంటె ఎక్కువగా మనష్షే చేశాడు. మరియు యెహోవా ఆ జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని ఆక్రమించుటకు వచ్చినప్పుడు ఇది జరిగింది.

10 తన సేవకులైన ప్రవక్తులను ఈ విషయాలు చెప్పమని యెహోవా నియమించాడు. 11 “యూదా రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ ప్రాంతములో నివసించిన అమోరీయుల కంటె ఎక్కువగా నీచమైన దుష్కార్యాలు చేసాడు. తన విగ్రహాల కారణంగా, యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు. 12 అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పుచున్నాడు; ‘చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము చెందేటట్లుగా, నేను యెరూషలేము, యూదాలకు విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను. 13 నేను షోమ్రోనులలో కొలత సూత్రాన్ని సాగదీస్తాను. మరియు యెరూషలేము మీదా అహాబు వంశముయొక్క మట్టపు గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; తర్వాత దానిని బోర్లించవచ్చు. నేను, ఆ విధంగా యెరూషలేముకు చేస్తాను. 14 అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచిపెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు. 15 ఎందుకని? నేను తప్పని చెప్పిన పనులు వారు చేశారు కనుక. తమ పూర్వికులు ఈజిప్టు నుంచి వెలుపలికి వచ్చిననాటినుంచీ వారు నన్ను కోపానికి గురిచేసారు.

రోమీయులకు 7:14-25

మనలోని యుద్ధం

14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.

స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International