Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 30:9-14

మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. 10 అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.

జీవం లేక మరణం

11 “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 12 మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’ 13 మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’ 14 లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.

కీర్తనలు. 25:1-10

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

కొలొస్సయులకు 1:1-14

దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలుడైన పౌలు నుండి, మరియు మన సోదరుడైన తిమోతి నుండి,

విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని పవిత్రులకు, మన తండ్రియైన దేవుడు మీకు శాంతిని, కృపను ప్రసాదించుగాక!

మేము మీ గురించి విన్నందుకు మన యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞులము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము. నిజమైన సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో కలిగింది. మీ విశ్వాసము, ప్రేమ, మీ ఆశపై ఆధారపడి ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలోకంలో భద్రంగా దాచి ఉంచాడు. దైవసందేశాన్ని విని, దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొన్న నాటినుండి మీరు ఫలం పొందారు. అదే విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది. మీరీ సువార్త “ఎపఫ్రా” ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు. మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు.

ఆత్మీయ జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించమని మిమ్మల్ని గురించి విన్ననాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము:

మీకు “దైవేచ్ఛ” ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష. 10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.

12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. 13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు. 14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.

లూకా 10:25-37

మంచి సమరయుని ఉపమానం

25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[a] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.

27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.

28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”

29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.

30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.

31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.

33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”

36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.

37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.

దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International