Revised Common Lectionary (Complementary)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
మోషే మామ నుండి సలహా
18 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజకుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు. 2 దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి పంపించినందు చేత ఆమె మోషే వద్ద లేదు) 3 మోషే ఇద్దరు కుమారులను కూడ యిత్రో తన వెంట తీసుకొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాణ్ణి” అని మోషే చెప్పాడు గనుక, మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు. “నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను రక్షించాడు” అని మోషే అన్నాడు గనుక, 4 మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. 5 దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు.
6 (మోషేకు యిత్రో ఒక సందేశం పంపించాడు), “నేను నీ మామ యిత్రోను. నీ భార్యను, నీ ఇద్దరు కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” అన్నాడు యిత్రో.
7 కనుక మోషే తన మామను కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని ఎదుట వంగి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు. 8 ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించిందీ, మోషే తన మామతో చెప్పాడు.
9 ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు. 10 యిత్రో ఇలా అన్నాడు:
“యెహోవాను స్తుతించండి.
ఈజిప్టు మనుష్యులనుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు.
ఫరో బారినుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు.
11 ఈజిప్టు వాళ్లకంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి
దేవుళ్లందరికంటె యెహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు తెలిసింది.”
12 అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామ యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేసారు.
27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. 29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.
2 మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. 2 మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. 3 క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.
4 తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. 5 నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.
క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం
6 మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. 7 మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.
© 1997 Bible League International