Revised Common Lectionary (Complementary)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం
12 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. 2 ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి. 3 వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.
4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. 5 మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం. ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి 6 మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం[a] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. 7 మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.
8 “ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం. 9 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలిసి సంతోషంగా సమయం గడపండి.
41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. 42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.
43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. 44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను. 45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’(A) తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.
47 “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది. 48 నేను మీ జీవితానికి ఆహారాన్ని. 49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. 50 కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. 51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
© 1997 Bible League International